భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, ఆగస్టు 2026, సోమవారంభారత్ సమాచార్

రాజకీయ లబ్ధి కోసమే ఎమ్మెల్యే పాదయాత్ర: అపర్ణ

WhatsApp Image 2026-08-30 at 7.19.46 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి నుంచి మెదక్ వరకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రక్షణ సేన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి చలంగారి దండే అపర్ణ ఆరోపించారు. రహదారి అధ్వానంగా ఉండటంతో పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణనష్టం జరిగినప్పటికీ ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆదివారం వెల్దుర్తిలో విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాదయాత్రపై పలు విమర్శలు చేశారు.

గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వెల్దుర్తి–మెదక్ రహదారి నిర్మాణం కోసం రూ.18 కోట్లు మంజూరు చేయించామని, త్వరలో రోడ్డు విస్తరణ పనులు చేపడతామని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హామీలు ఇచ్చారని అపర్ణ పేర్కొన్నారు. అయితే పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఈ రహదారి సమస్య ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. అప్పట్లో మంజూరైన రూ.18 కోట్లు ఎక్కడికి వెళ్లాయని నిలదీశారు. రహదారి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఆరోపించారు.

వెల్దుర్తి, ఉప్పులింగాపూర్, రామాయంపల్లి, బండపోసాని, పల్లిశెట్టిపల్లి తదితర ప్రాంతాల ప్రజల సమస్యలను పట్టించుకోకుండా మంజూరైన నిధులను సొంత మండలం శివంపేట అభివృద్ధికి వినియోగించారని అపర్ణ ఆరోపించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ప్రజాదరణ తగ్గుతోందని, అందుకే రాజకీయ లబ్ధి కోసం పాదయాత్ర పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు సునీత లక్ష్మారెడ్డిని నమ్మే పరిస్థితి లేదని అన్నారు.

వెల్దుర్తి మండల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే చిత్తశుద్ధితో వ్యవహరించాలని అపర్ణ డిమాండ్ చేశారు. రహదారి విస్తరణకు సంబంధించిన నిధులు, పనులపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రమాదాలకు కారణమవుతున్న వెల్దుర్తి–మెదక్ రహదారిని వెంటనే అభివృద్ధి చేసి ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సమస్యలను రాజకీయ ప్రయోజనాలకు కాకుండా శాశ్వత పరిష్కార దిశగా తీసుకెళ్లాలని సూచించారు.