భారత్ సమాచార్, సినీ టాక్స్ : ఐఏఎస్, ఐపీఎస్.. ఇవి దేశంలోని లక్షలాది యువతకు కలల ఉద్యోగాలు. ప్రైవేట్ కొలువుల్లో లక్షల జీతం వస్తున్నా వదిలేసి వచ్చి మరీ సివిల్స్ కు ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొందరు ఫస్ట్ అటెంప్ట్ లోనే విజయం సాధించి ఔరా అనిపిస్తే.. మరికొందరు చివరి అటెంప్ట్ లో సాధిస్తారు. ఇంకొందరు తమ లక్ష్యం నెరవేరకుండానే మిగిలిపోతారు. గుండెల నిండా కసితో చదివితే పేదవాడికైనా సివిల్స్ సాధ్యమే అని ఎందరో నిరూపించారు.
అలాంటి వారిలో ఐపీఎస్ మనోజ్ శర్మ ఒకరు. ఈయనది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మెరెనా జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. పోలీస్ కావాలని చిన్న నాటి నుంచి కలలు కంటాడు. అయితే ఆయన ట్రాక్ రికార్డు ఏమాత్రం బాగలేదు. చదువు సరిగ్గా అబ్బలేదు. టెన్త్ లో థర్డ్ క్లాస్ లో పాసైతాడు. ఇంటర్ లో హిందీ తప్పా అని ఫెయిలయ్యాడు. అయినా తాను ఐపీఎస్ కావాలనుకుని రోజుకూ 15గంటలు పనిచేసుకుంటూ..3 గంటలు మాత్రమే నిద్రపోతూ మిగిలిన సమయంలో చదివాడు. చివరకు సివిల్స్ లో జాతీయ స్థాయిలో 121వ ర్యాంకు సాధించి ఐపీఎస్ గా ఎంపికయ్యాడు.
మనోజ్ సక్సెస్ స్టోరీపై వచ్చిన ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమా ఇటీవల రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఓటీటీలో ఈ మూవీ రికార్డులు తిరగరాస్తోంది. ఇటీవలే టాప్-250 ఇండియన్ ఫిల్మ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న ఈ మూవీ.. తాజాగా ఐఎంబీడీలో 10కి 9.2 రేటింగ్ తో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత యానిమేటెడ్ మూవీ రామాయణ, నాయకుడు, గోల్ మాల్ మూవీస్ ఉన్నాయి. ట్వెల్త్ ఫెయిల్ ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.