భారత్ సమాచార్.నెట్, చెన్నై: సనాతన ధర్మంపై ప్రముఖ సినీ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందూ సంఘాలు, బీజేపీ నేతలు కమల్ హాసన్ వ్యాఖ్యలపై భగ్గుమంటున్నాయి. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు కారణంగా కమల్ హాసన్ నటించిన సినిమాలను చూడడం మానేయాలని తమిళనాడు బీజపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు తమిళనాడు బీజేపీ ఓ వీడియో విడుదల చేసింది.
గతంలో ఉదయనిధి స్టాలిన్, ఇప్పుడు కమల్ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమిళనాడు బీజేపీ సెక్రటరీ అమర్ ప్రసాద్. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని.. హిందువులు ఎవరూ కమల్ సినిమాలను చూడవద్దని.. ఓటీటీలోనూ చూడవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలా చేస్తే వారు బహిరంగ వేదికలపై ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయారని.. లక్షలాది హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉంటరని పేర్కొన్నారు.
మరోవైపు కమల్ హాసన్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు తమిళిసై, ఖుష్బూ కమల్ వ్యాఖ్యలను ఖండించారు. సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. విద్య గురించే మాట్లాడే కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏం ఉందని మండిపడ్డారు. కాగా, ఇటీవల సినీ నటుడు సూర్యకు చెందిన ‘అగరం ఫౌండేషన్’ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియంతృత్వం, సనాతన ధర్మపు సంకెళ్లను తెంచగల ఏకైక ఆయుధం విద్య అంటూ కమల్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.