భారత్ సమాచార్.నెట్, పూణే: మహారాష్ట్రలో ఓ శిక్షణ విమానం కూలింది. పూణే జిల్లా బారామణి ఎయిర్‌పోర్టు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్‌కి చెందిన శిక్షణా విమానం.. శిక్షణ పూర్తి చేసిన అనంతరం ల్యాండింగ్ సమాయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
అయితే విమానం ముందు చక్రం దెబ్బతిన్నట్లు గమనించిన పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాడు. ఫలితంగా విమానం రన్‌వే నుండి పక్కకు వాలిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని.. పైలట్ క్షేమంగా ఉన్నారని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇకపోతే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల విమాన ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. శిక్షణ విమానాలు, ప్రయాణికులతో వెళ్తున్న పలు విమానాలకు టేకాఫ్ అయిన తర్వాతా సమస్యలు తెలెత్తడం.. లేదంటే క్రాష్ అవుతున్న సంగతి తెలిసిందే. విమానాల్లో ప్రయాణం చేయాలంటే వణుకుతున్నారు ప్రయాణికులు.