భారత్ సమాచార్, ఏలూరు ;
చట్టం ఏం పోలీసులకు చుట్టం కాదని నిరూపించాడు సాధారణ పౌరుడు అవుటుపల్లి సీతయ్య. పోలీసులపై న్యాయ పోరాటం చేసి కోర్టు ఆదేశాల ద్వారా సీఐ, ఎస్ ఐ, కానిస్టేబుళ్ల పై వారు పని చేసిన పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదు చేయించారు. పోలీసు స్టేషన్లో ఓ వ్యక్తిని కొట్టారనే అభియోగంపై కోర్టు ఆదేశాల మేరకు సీఐ, ఇద్దరు ఎస్ ఐ లు, అయిదుగురు కానిస్టేబుళ్ల పై కేసు నమోదు చేసినట్టు తాజాగా పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏలూరు సత్రంపాడుకు చెందిన అవుటుపల్లి సీతయ్య 2021లో ఏలూరు పాత బస్టాండులోని అప్పలరాజు హోటల్ కు వెళ్లి భోజనం చేశారు. బిల్లు చెల్లించే విషయంలో ఇతనికి, హోటల్ నిర్వాహకులకు గొడవ జరిగింది. ఈ గొడవ విషయమై సీతయ్య టూటౌన్ పోలీసుస్టేషన్ కి వచ్చి హోటల్ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు గురించి స్టేషన్ కు వెళ్లిన సమయంలో తనతో అప్పటి సీఐ ఆదిప్రసాద్, ఎస్సైలు నాగబాబు, కిషోర్ బాబు దురుసుగా ప్రవర్తించారని, కానిస్టేబుళ్లతో కలిసి కొట్టారని సీతయ్య మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలని కమిషన్ అధికారులకు విన్నవించారు. కమిషన్ సూచనల మేరకు కోర్టులో ప్రైవేటు కేసు వేశారు సీతయ్య.
విచారించిన మొబైల్ కోర్టు బాధ్యులపై కేసు నమోదు చేయాలని తాజాగా ఆదేశించడంతో త్రీటౌన్ సీఐ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఎస్సై ప్రసాద్ అప్పట్లో టూటౌన్ సీఐగా పని చేసిన ఆదిప్రసాద్, ఎస్సైలు నాగబాబు, కిషోర్బాబు, కానిస్టేబుళ్లు వెంకట సత్యనారాయణ, రవికుమార్, శ్రీనివాసరావు, జీవరత్నం, రాజేష్ లపై తాజాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోపక్క ఎస్సై కిషోర్ బాబు పై చీటింగ్ కేసు నమోదు చేయాలని మొబైల్ కోర్టు పోలీసులకు ఆదేశించడంతో ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై కిషోర్ బాబు పై మరో చీటింగ్ కేసు కూడా నమోదు చేసినట్టు వెల్లడించారు.