భారత్ సమాచార్.నెట్: ఆధార్ ఎప్పటికీ తొలి గుర్తింపు కాదని ఉడాయ్ సీఈఓ భువనేశ్ కుమార్ పేర్కొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిర్వహించాలని ఇటీవల ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల సంఘం నిర్ణయంతో త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం అక్కడి రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బిహార్ ఓట్ల సవరణ జాబితా నుంచి ఆధార్‌ను మినహాయించాలనే అంశంపై ప్రస్తుతం బిహార్‌లో వివాదం నడుస్తోంది.
ఈ క్రమంలోనే ఉడాయ్ సీఈవో భువనేశ్ కుమార్ ఈ వివాదంపై స్పందించారు. ఆధార్ కార్డ్ ఎప్పుడూ కూడా తొలి గుర్తింపు కాదని.. నకిలీ ఆధార్‌కార్డులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్యూఆర్ కోడ్ స్కానర్ యాప్ సాయంతో ఫేక్ ఆధార్ కార్డులు గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ ఫేక్ ఆధార్ కార్డులు ఎవరైనా తయారుచేసినా కూడా ఈ యాప్ ద్వారా వాటిని చెక్ చేసి అడ్డుకోవచ్చని స్పష్టం చేశారు.
ఇకపోతే ప్రస్తుతం కొత్త ఆధార్ యాప్ అభివృద్ధి దశలో ఉందని.. ఇది అందుబాటులోకి వస్తే ఆధార్ ఫిజికల్ కాపీలు పంచుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన తెలిపారు. ఇకనుంచి మాస్క్ వెర్షన్ కీలకం కానుంది. వినియోగదారుల సమ్మతిని బట్టి ఆధార్ కార్డు వివరాలను పూర్తి లేదా మాస్క్ ఫార్మాట్‌లో పంచుకునే అవకాశం ఉంటుంది. కాగా దేశంలో చాలా మంది తమ తమ గుర్తింపు కోసం మొదటిగా చూపిస్తోంది ఆధార్ కార్డే.