భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అయ్యప్ప స్వామి వారి పుణ్య క్షేత్రంలో 1985 కు పూర్వం ప్రతి సంవత్సరం యాత్రకు వచ్చే భక్తులు మెట్లుఫై కొబ్బరికాయలు కొట్టే ఆచారం ఉండేది. కన్నెస్వామి అయితే మొదటి మెట్టు ఫై కొబ్బరికాయ కొడితే, మిగిలిన వారు వారి వారి యాత్ర సంవత్సరం లెక్కన మెట్లు ఫై కొబ్బరికాయ కొట్టి, మెట్లు ఎక్కి అయ్యప్ప సన్నిధానం చేరుకొనేవారు. కొన్ని వేల సంవత్సరాల నుండి భక్తులు పగలకొట్టిన కొబ్బరి కాయల వలన ఆ రాతి మెట్లు దాదాపుగా శిథిలావస్థకు చేరాయి. ఆ రాతి మెట్ల ను తొలగించి అలాంటి కొత్త రాతి మెట్ల నిర్మించవచ్చునా అని దైవ ప్రశ్నలు అడగాగా ఆ మెట్లు శిథిలావస్థకు చేరిన దాని పవిత్రత ఏ మాత్రం చెక్కు చెదరలేదు అని సమాధానం వచ్చినది.
ఈ దేవ ప్రశ్న సుప్రసిద్ధ జ్యోతిష్య పండితులు పరమేశ్వరన్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అటు పిమ్మట దేవస్థానం బోర్డు వారు మరియు పెద్దలు అందరూ కలిసి ఏమి చేద్దామని బాగా ఆలోచించి అదే 18 మెట్ల నీ పంచలోహం తో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి దేవస్థానం బోర్డు చైర్మన్ గారైన భాస్కర నాయుడు గారి అధ్యక్షతన కేరళలోని కంచు వ్యాపారి అయ్యప్ప స్వామి వారి పట్ల భక్తి భావం కలవాడైనా పి మాధవన్ తంబి గారికి ఎంతో పవిత్రమైన పనిని అప్పజెప్పడం జరిగినది. ఇందుకోసం దేవస్థానం బోర్డు వారు 10 కిలోల బంగారం 30 కిలోల వెండి మరియు రాగి కంచు ఇత్తడి లోహములు ఇవ్వడం జరిగినది.
ఐదు అడుగుల పొడవు తొమ్మిది అంగుళాల వెడల్పు ఒకటిన్నర అంగుళం మందము తో తయారుచేయబడిన ఒక్కొక్క మెట్టు పైన మరియు పక్క భాగాలకు ముప్పావు అంగుళం మందం గల రేకులు పొదిగి మెట్లకు కవచంలా మేకులతో బిగించారు ఈ పవిత్ర కార్యక్రమాన్ని మొత్తం కేరళ రాజధాని తిరువనంతపురంలో కోమల విలాసం అనే ఫ్యాక్టరీలో శ్రీ మాధవన్ తంబి మరియు వారి కుమారుడగు కుమార్ వాళ్ల ప్రత్యేక పర్యవేక్షణలో తయారు చేయు కార్యక్రమం నిర్వహించబడింది. 1985 నవంబర్ నెల 26వ తారీఖున శబరిమల ప్రధాన తాంత్రికులు మరియు పూజారుల తాంత్రిక పూజా విధానంతో జీవోధారణ జరిపి 1985 నవంబర్ 30వ తారీఖున తయారుచేసిన రేకులను శబరిమలకు తీసుకు రావడం జరిగింది. అదే రోజు రాత్రి మెట్లపై పొదిగి పొన్ను పదునెట్టాంబడి తయారు చేసినారు అదే రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి నుంచి బంగారు మెట్లపై ఎవరూ కొబ్బరికాయ కొట్టకూడదని తీర్మానం చేశారు.