July 28, 2025 5:11 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Action: అలాంటి కంటెంట్ పెడితే.. కఠిన చర్యలు తప్పవు!

భారత్ సమాచార్.నెట్: భారత్ దేశానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని పుట్టించే వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఇందుకోసం ఓ ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయడమే కాకుండా.. వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది కేంద్ర ప్రభుత్వం.

ఇటీవల కొన్ని వెబ్‌సైట్లలో భారత వ్యతిరేక కంటెంట్ అప్లోడ్ అవుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం దీనిపై దృష్టి సారించింది. ఈ కొత్త విధానంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీకి తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోషల్ మీడియా పర్యవేక్షణ కోసం ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పార్లమెంటరీ కమిటీకి సమాచారం అందినట్లు తెలుస్తోంది.

ఇక సోషల్ మీడియా వేదికలపై దేశ వ్యతిరేక వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయనుంది కేంద్రం. ఖలిస్తాన్ వేర్పాటువాద గ్రూప్‌కు చెందిన ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్ను సహా పలువురు భారత వ్యతిరేకులు సోషల్ మీడియా వేదికలపై చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వారు దేశంలో సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ప్రచారం చేస్తున్నారు.
కేంద్రం రూపొందిస్తున్న కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత.. అలాంటి వారిని అరికట్టవచ్చు. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని వదలే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది.

Share This Post
error: Content is protected !!