భారత్ సమాచార్.నెట్: గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్ (Ahmedabad)లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. లండన్ వెళ్లేందుకు బయలుదేరిన ఎయిరిండియా (Air India) విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విమాన సిబ్బందితో సహా 242 మంది ఫ్లైట్‌లో ఉన్నారు. అయితే వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది. విమానంలో ఆయన ప్రయాణానికి సంబంధించిన టికెట్ ఒకటి ముందుగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
లండన్‌లో నివసిస్తున్న తన కుమార్తెను కలిసేందుకు ఆయన వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో ఆయనను రక్షించినట్లుగా లేదా ఆయన మృతదేహాన్ని కనిపెట్టినట్లుగా ఇత వరకూ సమాచారం రాలేదు. ఆయనకు ఏమైనా అపాయం జరిగిందా? లేక ఆయన సురక్షితంగా ఉన్నారా అన్న విషయంపై అధికారిక ప్రకటన రావాల్సిందే. భారతీయ జనతా పార్టీకి చెందిన విజయ్ రామ్‌నిక్‌లాల్‌భాయ్ రూపానీ 2016 నుండి 2021 వరకూ రెండు టెర్మ్‌లు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన చిన్న కుమారుడు పూజిత్ గతంలో జరిగిన ఓ ప్రమాదంలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు.
ఇకపోతే గురువారం మధ్యాహ్నం 1:39 గంటల సమయంలో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా ఏఐ-171 విమానం.. ఎయిర్ పోర్టు సమీపంలో ఉన్న మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానం కూలింది. ప్రమాదం చోటుచేసుకున్న ప్రదేశంలో సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కాగా, విమానం హాస్టల్ భవనంపై కూలడంతో మెడికోలు చనిపోయినట్లుగా సమాచారం. మృతుల సంఖ్యపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Share This Post