August 4, 2025 7:01 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 274కు చేరిన మృతుల సంఖ్య

భారత్ సమాచార్.నెట్: గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌ (Ahmedabad) నగరంలో ఎయిరిండియా విమాన ప్రమాదం (Air India Plane Crash) దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు (Sardar Vallabhbhai Patel International Airport) నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. అయితే విమానం ప్రమాదానికి గురవ్వడమే కాకుండా, అది మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో మృతుల సంఖ్య పెరిగింది.
ఈ విమానంలో 230 మంది ప్రయాణికులు, 10 మంది క్రూ సిబ్బంది, ఇద్దరు పైలట్లతో కలిపి 242 మంది ఉండగా.. 241 మంది దుర్మరణం పాలయ్యారు. మెడికల్ కాలేజీ భవనంలో 24 మంది విద్యార్థులు మృతి చెందారు. విమానం ప్రమాదంలో ఒకే ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాసీ సీఎం విజయ్ రూపానీ కూడా మృతిచెందారు. ఇక మెడికల్ కాలేజీ భవనంపై విమానం కూలడంతో 24 మంది మెడికో విద్యార్థులు మరణించగా.. 9 మంది చికిత్స పొందుతూ మరణించారు. దీంతో అహ్మదాబాద్ విమాన ప్రమాద దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 274కి చేరింది.
మరోవైపు ఈ ఘోర విమాన ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నతస్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. భవిష్యత్‌లో ఇలాంటి గగనతల ప్రమాదాలు జరగకుండా కఠినమైన ఫ్రేమ్‌వర్క్‌ను కమిటీ ప్రతిపాదించనుంది. కమిటీ స్వతంత్రంగా పనిచేయనుందని, ప్రస్తుతం ఘటనపై సంబంధిత అధికారుల సాంకేతిక దర్యాప్తు కొనసాగనుందని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన అత్యంత కీలకమైన “బ్లాక్ బాక్స్” ను అధికారులు ఇప్పటికే స్వాధినం చేసుకున్నారు. ఈ బ్లాక్ బాక్స్‌ డేటాను విశ్లేషించి, ఈ ప్రమాదానికి గల అసలు కారణాలను అధికారులు తెలుసుకోనున్నారు.
Share This Post