భారత్ సమాచార్, ఆరోగ్యం ;
ఏటా ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అంతేకాదు క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. క్యాన్సర్లలో ఎన్ని వందల రకాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివిధ రకాల క్యాన్సర్లు రావడానికి ఒక్కో దానికి ఒక్కో కారణం ఉంటుంది. అలాంటి కారణాల్లో ఆల్కహాల్ కూడా ఒకటి. ఆల్కహాల్ కారణంగా ఆరు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఆల్కహాల్ వల్ల వచ్చే క్యాన్సర్లు
అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం మొత్తం క్యాన్సర్ కేసులలో ఐదు శాతం కంటే ఎక్కువ మద్యపానం తాగే వారిలోనే కనిపిస్తున్నాయి. అంటే ఆల్కహాల్ కారణంగానే వారు ఆరు రకాల క్యాన్సర్ల బారిన అధికంగా పడుతున్నారు. అది మెడ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, పొట్ట క్యాన్సర్, పేగు క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, కాలేయ క్యాన్సర్. ఇవన్నీ ఆల్కహాల్ ఎక్కువ తాగే వారిలో వస్తాయని తేలింది. ఒక రోజులోనే మూడు కన్నా ఎక్కువసార్లు ఆల్కహాల్ తీసుకుంటే పొట్ట క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని అధ్యయనాలు వివరిస్తున్నాయి.
మగవారిలో వచ్చే క్యాన్సర్:
మద్యం తాగే మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ అధికంగా ఉంటుంది. ఎన్నో రకాల ఆల్కహాలిక్ పానీయాలతో క్యాన్సర్ కు అనుబంధం ఉన్నట్టు ఇప్పటికే అధ్యయనాలు తేల్చాయి. ప్రపంచవ్యాప్తంగా కోటి మంది కేవలం క్యాన్సర్ కారణంగానే మరణిస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మన దేశంలో కూడా ప్రతి ముగ్గురిలో ఇద్దరికీ క్యాన్సర్ వ్యాధి బయట ముదిరిన తర్వాతే వ్యాధి నిర్ధారణ అవుతుంది. దీంతో మరణాల సంఖ్య పెరిగిపోతుంది. క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడం అపోహల వల్లే ఇలా క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం అవుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. క్యాన్సర్ వారసత్వంగా, జన్యుపరమైన కారణాల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే రోగ నిరోధక వ్యవస్థ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. వయసు ముదరడం వల్ల కూడా కొందరిలో క్యాన్సర్ కణాలు పెరుగుతాయి. వీటిని అడ్డుకోవడం కాస్త కష్టమే, కానీ మనిషి చేసుకున్న కొన్ని అలవాట్ల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వాటిని నియంత్రణలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఊబకాయం, మద్యపానం, పొగాకు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు ఆహారపు అలవాట్లు కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. వీటిని దూరంగా పెడితే ఆ మహమ్మారి భారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.
కేవలం పొగాకులోనే 80 రకాల క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు అధ్యాయణాలు గుర్తించాయి. పొగాకు నుంచి వచ్చే పొగ ప్రమాదకరమైన కార్సినోజెనిక్ ఏజెంట్లను కలిగి ఉంది. అవి ఊపిరితిత్తుల్లోకి చేరి రక్త ప్రవాహంలో కలిసిపోతాయి. దీనివల్ల అనేక రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం పెరుగుతుంది. అధిక బరువు కూడా గర్భాశయ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి వాటిని పడేలా చేస్తుంది.కాబట్టి బరువును తగ్గించుకోవలసిన అవసరం ఉంది. ఇక మద్యపానం చేసే వారిలో రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, పొట్ట క్యాన్సర్, పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి మద్యపానం చేసేవారు ఆ అలవాటును వదిలిపెట్టి ప్రాణాలను కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.