భారత్ సమాచార్.నెట్: బీజేపీ అగ్ర నేతలు వరుసగా అరుదైన రికార్డులు సృష్టిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ హిస్టరీ క్రియేట్ చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత అత్యధిక కాలం దేశానికి సేవలందించిన ప్రధానిగా.. నరేంద్ర మోదీ నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాని మోదీ తరహాలో బీజేపీ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రిగా పని చేసిన వ్యక్తిగా అమిత్ షా నిలిచారు. మోదీ పాలనలో కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా 6 సంవత్సరాల 64 రోజులు నేటితో పూర్తి చేసుకుని.. ఇంకా ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ (లాల్ కృష్ణ అద్వానీ) పేరిట ఉండగా.. ఆ రికార్డును షా తాజాగా బ్రేక్ చేశారు.
మోదీ ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు అంటే 2019 ఎన్నికల తర్వాత అమిత్ షా హోం మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఐదు ఏళ్లు ఆ పదవిలో కొనసాగగా.. ఇటీవల 2024లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టగా.. అప్పుడు కూడా అమిత్ షా హోం మంత్రిగానే బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు అంటే ఆగస్ట్ 5వరకు ఆయన హోం మంత్రిగా సేవలందిస్తూ.. ఎల్‌కే అద్వానీ, కాంగ్రెస్ నేత గోవింద్ వల్లభ్ పంత్ రికార్డ్‌ను బ్రేక్ చేశారు.