భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: ఆపరేషన్ సింధూర్‌పై పార్లమెంట్‌లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. లోక్‌సభలో ఆపరేషన్ సింధూర్‌పై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వివరణ ఇస్తుండగా.. ప్రతిపక్షాలు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలాయి. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. కోపంతో ఊగిపోతూ.. ప్రతిపక్షాలు భారత విదేశాంగ మంత్రిని నమ్మకుండా.. విదేశీ వాదనలను నమ్ముతున్నాయని తీవ్రంగా విమర్శించారు.
వారి పార్టీలో విదేశీయుల ప్రాముఖ్యతను తాను అర్థం చేసుకోగలనని.. కానీ వారి పార్టీకి సంబంధించిన అన్ని విషయాలను ఇక్కడ సభలో రుద్దకూడదని హితవు పలికారు. అందుకే వారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారని.. మరో 20 ఏళ్లు కూడా ఇలానే ప్రతిపక్షంలోనే ఉంటారని ఘాటుగా విమర్శించారు. ఇంత తీవ్రమైన అంశంపై చర్చిస్తున్నప్పుడు.. ప్రతిపక్షం సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం సముచితామేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు షా.
మరోవైపు ఆపరేషన్ మహాదేవ్‌పై పార్లమెంట్ వేదికగా అమిత్ షా కీలక ప్రకటన చేశారు. పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను ఆపరేషన్ మహాదేవ్‌లో భాగంగా మట్టుబెట్టామని స్పష్టం చేశారు. పహల్గామ్‌లో టూరిస్టులపై దారుణంగా దాడికి పాల్పడ్డారని.. వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే వారిని హత్య చేశారన్నారు. మతం పేరు అడిగి మరి తూటాలు దించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టులు పాక్ వెళ్లేందుకు ప్రయత్నించిన వారికి సరిహద్దు దాటే అవకాశం ఇవ్వలేదని… ఆపరేషన్ మహాదేవ్ ప్రారంభించి వారిని మట్టుబెట్టామని తెలిపారు.