భారత్ సమాాచార్.నెట్: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు సుమారు 10 రోజుల పాటు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీలో విశేష చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలుపై కూడా అసెంబ్లీలో ప్రత్యేక చర్చలు జరగనున్నాయి.
అదేవిధంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో బనకచర్ల ప్రాజెక్టుపై కూడా ప్రత్యేక చర్చ జరగనున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే, ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన తాజాగా కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రుల పని తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు ఇక రోజులు లెక్కపెట్టుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజాసమస్యలపై స్పందించకున్నా, కార్యకర్త, నాయకులకు గౌరవం ఇవ్వకున్నా మీ స్థానంలో కొత్తవారు వస్తారని మంత్రులకు స్పష్టం చేశారు సీఎం. అలాగే మహిళా ఎమ్మెల్యేను వైసీపీ నేతలు కించపరిస్తే వెంటనే ఎందుకు స్పందించలేదని కూడా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమయ్యారని.. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు.
Share This Post