భారత్ సమాచార్.నెట్, ఏపీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) తో చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు. ఇద్దరి మధ్య పలు ఒప్పందాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇకపోతే బిల్ గేట్స్‌తో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బిల్ గేట్స్‌తో సమావేశం అద్భుతంగా సాగిందంటూ ట్వీట్ చేశారు.
ఈ మేరకు ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమంపై, గేట్స్ ఫౌండేషన్ ఏ విధంగా భాగస్వామ్యం కావొచ్చనే అంశంపై కీలకంగా చర్చించామని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాలపై చర్చ జరిగిందని పేర్కొన్నారు. అలాగే అధునాతన సాంకేతికత పరిజ్ఞానాల వినియోగ అవకాశాలను పరిశీలించామని చెప్పుకొచ్చారు. పీ4, స్వర్ణాంధ్ర 2047 దార్శనికత సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ లక్ష్యసాధనలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ పురోగతికి బిల్ గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.