భారత్ సమాచార్, అమరావతి ;
కులవృత్తులను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆదరణ పథకాన్ని మళ్లీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజనతో ఆదరణ పథకాన్ని అనుసంధానం చేసి అమలుచేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజన కింద ఎంపికైన వారికి 2 విడతల్లో రూ.3 లక్షలు రుణం అందిస్తారు. ఈ రుణానికి 13 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో 8 శాతం వడ్డీని కేంద్రం భరిస్తుండగా..మిగిలిన ఐదుశాతాన్ని లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పీఎం విశ్వకర్మ యోజనకు ఆదరణ పథకాన్ని లింక్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఆదరణ- విశ్వకర్మ యోజనగా దీనికి పేరు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.మరోవైపు పీఎం విశ్వకర్మ యోజన కింద పరికరాల కొనుగోలుకు రూ.15 వేల రూపాయలు అందిస్తున్నారు. అలాగే ట్రైనింగ్ కోసం నాలుగు వేలు ఇస్తున్నారు. అయితే ఆదరణ- విశ్వకర్మ యోజన కింద. ఈ మొత్తానికి తన వాటా కింద అదనంగా మరికొంత అందించేలా రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. అలాగే ఈ పథకం కింద ఎంపిక చేసినవారికి వడ్డీ లేకుండా రూ.3 లక్షలు అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 13 శాతం వడ్డీలో 8 శాతం కేంద్రం, 5 శాతం లబ్ధిదారులు చెల్లిస్తుండగా.. లబ్ధిదారులు చెల్లించే ఐదుశాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే మూడు లక్షల రుణంలోనూ కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించేలా బీసీ సంక్షేమ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ రకంగా మొత్తం రూ.3 లక్షల రుణాన్ని సున్నా వడ్డీకే అందించేలా ప్లాన్ చేస్తున్నారు.