భారత్ సమాచార్.నెట్, ఏపీ: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో గిరిజనులు ప్రత్యేకంగా పండించే అరకు కాఫీ (Araku Coffee)కి ఎక్కడ లేని ప్రాధాన్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఉత్పత్తుల్లో అరకు కాఫీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే అరకు కాఫీకి పార్లమెంట్(Parliament)లో ప్రత్యేక స్థానం దక్కింది. కేంద్ర మంత్రులు సహా పలువురు నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఏపీ పార్లమెంటు సభ్యుల విజ్ఞప్తి మేరకు పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయడానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Loksabha Speaker Om Birla) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్.. స్పీకర్ ఓం బిర్లాకు కీలక విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో శాశ్వత అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు, సీఎం రమేష్ కలిసి అరకు కాఫీ ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఉత్పత్తుల్లో అరకు కాఫీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ(PM Modi) సైతం మన్ కీ బాత్(Mann ki Baat) కార్యక్రమంలో ప్రస్తావించినట్లు స్పీకర్‌కు తెలిపారు. ఇక ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో స్టాల్ ఏర్పాటుకు అనుమతించారు.
అయితే ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుకు అనుమతించారు. శాశ్వతంగా స్టాల్ ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ చెప్పారు. దీనిపై ఏపీ ఎంపీలు సంతోషం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్ పెడితే.. దానికి మరింత గుర్తింపు లభిస్తుందని, దేశవ్యాప్తంగా కాఫీ ప్రేమికుల్లో అరకు కాఫీకి ప్రత్యేక స్థానం ఏర్పడుతుందని భావిస్తున్నారు. కాగా ఇక ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో స్టాల్ ఏర్పాటుకు అనుమతించారు. అరకు కాఫీకి సంబంధించిన ఈ కార్యక్రమం పార్లమెంట్లో కాఫీ ప్రియులకు ఒక ప్రత్యేక అనుభవాన్ని అందించడంతో పాటు, దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ కాఫీని పరిచయం చేయడానికి దోహదపడుతుంది.