భారత్ సమాచార్.నెట్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో రమాదేవిపై కొందరు దాడి చేశారు. ఆలయానికి చెందిన 889.5 ఎకరాల భూముల్లోని అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు సిబ్బందితో కలిసి ఆమె అక్కడికి వెళ్లారు. అయితే ఈ క్రమంలోనే ఆలయ సిబ్బంది, పురుషోత్తపట్నం గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడి చేయగా.. ఆమె స్పృహ కోల్పోవడంతో అక్కడ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో భద్రాద్రి ఆలయానికి సంబంధించిన 889.50 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూములను దేవస్థానానికి అప్పగించాలని ఏపీ హైకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొందరు ఆక్రమణదారులు ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కబ్జాకు గురువుతున్న దేవస్థానం భూములను పరిరక్షించే క్రమంలో అక్కడికి వెళ్లిన ఈవోపై దాడి జరిగింది.
ఆక్రమణదారులను నిలువరించే క్రమంలోనే ఆలయ ఈవోపై పురుషోత్తపట్నం గ్రామస్థుల దాడికి తెగబడ్డారు. గ్రామస్థుల దాడిలో స్పృహ కోల్పోయిన ఆమెను ఆలయ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరోవైపు స్థానికంగా ఆలయ ఈవో దాడి ఘటన కలకలం రేపింది. ఆలయ భూముల పరిరక్షణకు వెళ్లిన మహిళా అధికారిపై దాడి జరగడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, భద్రాచలం రామాలయానికి చెందిన భూముల వ్యవహారంలో గత కొంతకాలంగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.
Share This Post