భారత్ సమాచార్.నెట్, కేరళ: కేరళ (Kerala)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల (Sabarimala) అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు. శబరిమల అయ్యప్ప స్వామి భక్తులు ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్‌పై ట్రావన్‌కోర్ దేవస్థానం (Travancore Devaswom Board) కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప ఆలయంలోని సన్నిధానంలోని పవిత్రమైన 18 మెట్లను ఎక్కిన వెంటనే.. స్వామిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తామని ట్రావన్‌కోర్ వెల్లడించింది. ఇప్పటివరకు 18 మెట్లను ఎక్కిన తర్వాత.. ఒక వంతెన వైపుగా భక్తులను పంపేవారు. దాని మీదుగా క్యూ లైనులో పంపుతూ కేవలం 5 సెకన్లు అయ్యప్పను దర్శించుకునేందుకు అనుమతిస్తున్నారు.
ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే మాస పూజలు, 12 రోజుల విషు పూజల సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. ఇది విజయవంతమైతే తదుపరి మండలం మకరవిళక్కు సీజన్‌లో శాశ్వతంగా అమలు చేయనున్నట్లుగా చెప్పారు. అయ్యప్పను దర్శించుకుంటున్న లక్షల మందిలో దాదాపు 80శాతం మందికి సంతృప్తికరమైన దర్శనం కలగలేదు అని టీడీబీ అధ్యక్షుడు పి.ఎస్.ప్రశాంత్ సోమవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. దీనిపై దేవస్థానం బోర్డుకు భక్తుల నుంచి వేల సంఖ్యలో లేఖలు, విజ్ఞప్తులు వచ్చని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నేరుగా 18 మెట్లను ఎక్కడానికి అవకాశం కల్పించడం వల్ల భక్తులు దాదాపు 20-25 సెకండ్లపాటు అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు.
అలాగే ప్రసాదాల ధరలను కూడా పెంచబోతున్నట్లు తెలిపారు. ఆలయ ప్రసాదాల రేట్లను 30 శాతం పెంచాలని ట్రావెన్‌కోర్ నిర్ణయించింది. ఆలయ ప్రసాదాల రేట్లను చివరిగా 2016లో సవరించారు. అయితే ట్రావెన్‌కోర్ బోర్డు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రసాదాల రేట్లను సవరించుకునేందుకు హైకోర్టు అనుమతి ఉంది. కానీ కోవిడ్ 19 మహమ్మారి వరదలు, కారణంగా ప్రసాదాల రేట్లను అమలు చేయలేదు ట్రావెన్‌కోర్. ఈ నేపథ్యంలోనే 9 ఏళ్ల తర్వాత ఈ రేట్లను సవరించనున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది.