భారత్ సమాచార్.నెట్: ఇస్కాన్ (Iskcon)కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ (Chinmoy Krishna Das) దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్ కోర్టు (Bangladesh court) ఆయనకు బెయిల్ (Bail) మంజూరు చేసింది. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అపహాస్యం చేశారనే ఆరోపణలు, ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఆయనతో పాటు మొత్తం 18 మందిపై కేసు నమోదైంది. ఈ కేసుల నేపథ్యంలోనే గతేడాది అక్టోబర్ 30న చిన్మయ్ కృష్ణదాస్‌ను చిట్టగాంగ్‌లో అదుపులోకి తీసుకున్నారు.
చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు నేపథ్యంలో బంగ్లాదేశ్ మాత్రం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆయన తరఫున వాదించేందుకు ముందుకు వచ్చిన న్యాయవాదికి బెదిరింపులు రావడం కూడా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే చిన్మయ్ కృష్ణ దాస్ భద్రతపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఆ తర్వాత అనేక సార్లు కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. తాజాగా చిన్మోయ్ తరపున దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎండీ అటోర్ రెహమాన్, జస్టిస్ ఎండీ అలీ రెజాలతో కూడిన ధర్మాసనం బెయిల్ ఇచ్చింది.
ఇకపోతే చిన్మయ్ కృష్ణదాస్ గతంలో ఇస్కాన్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన అరెస్టు సమయంలో ఇస్కాన్ బంగ్లాదేశ్ శాఖ ఆయన చర్యలతో తమకు సంబంధం లేదని ప్రకటించింది. అయితే తాజాగా బెయిల్ మంజూరు కావడంతో ఇస్కాన్ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. అలాగే మైనారిటీల హక్కులు, భద్రతను సమర్థించే బంగ్లాదేశ్ సమ్మిలిత సనాతని జాగ్రన్ జోట్ అనే సంస్థకు చిన్మయ్ కృష్ణదాస్ ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ మైనార్టీల హక్కులు, భద్రత అంశాలపై కృషి చేస్తోంది.