భారత్ సమాచార్.నెట్: తెలంగాణ రాజకీయ వర్గాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మీకు మీ పార్టీకి ఓ దండం అంటూ గోసామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీకి అనూహ్యంగా రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించిన ఆయన, అభ్యర్థిత్వ ప్రక్రియలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయని ఆరోపించారు. దీనికి సంబంధించిన రెండు పేజీల రాజీనామా లేఖను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పంపారు. బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తన మద్దతుదారులతో చేరిన రాజాసింగ్.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అక్కడే ప్రకటించారు. తన అనుచరులను బెదిరిస్తూ, పార్టీలోని పదవుల నుంచి తొలగిస్తామన్న హెచ్చరికలు వచ్చాయని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రాజాసింగ్. ఈ విషయమై కేంద్రమంత్రి బండి సంజయ్ రాజాసింగ్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇకపై బీజేపీ ఎమ్మెల్యేను కాదు.. కానీ హిందుత్వానికి నేను ఎప్పటికీ కట్టుబడి ఉంటానని రాజాసింగ్ స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలు బీజేపీకి అవకాశమివ్వాలనుకుంటున్నారు. కానీ ఆ పార్టీని అధికారంలోకి రానీయకూడదనే బీజేపీలోని కొందరికి ఆసక్తి కనిపిస్తోందని ఆరోపించారు. 2019 నుంచి ఉగ్రవాదుల లక్ష్యంగా మారి కూడా పార్టీ కోసం పనిచేశానని, అయినప్పటికీ తగిన గుర్తింపు రాలేదని వాపోయారు. మీకు ఒక దండం.. మీ పార్టీకి ఒక దండం అంటూ తన రాజీనామా లేఖను బహిరంగంగా చూపించారు. కాగా గత కొంతకాలంగా రాజాసింగ్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అంతే కాదు ఆ పార్టీలోని ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలు చేశారు.