భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి, సంప్రదాయాలకు మరోపేరు బతుకమ్మ పండుగ. తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మను జరుపుకుంటారు. పూలనే దేవుళ్లుగా కొలిచే ప్రకృతి పండుగ బతుకమ్మ. ఏటా భాద్రపద అమావాస్య మొదలు.. ఆశ్వయుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులపాటు ఈ పండుగను రాష్ట్ర ఆడపడుచులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీనిని పూల పండుగ అని కూడా అంటారు. తెలంగాణ అస్తిత్వాన్ని బతుకమ్మలోనే చూస్తారు. తొమ్మిది రోజులపాటు అన్ని రకాల పువ్వులతో బతుకమ్మను అందంగా పేర్చి మహిళలంతా ఒకచోట చేరి పాటలు పాడుతూ వేడుకగా నిర్వహిస్తారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో పాటలకు ఎంత ప్రాధాన్యత ఉండేదో బతుకమ్మ పాటలు అంతే ఫేమస్ అని చెప్పవచ్చు. ఈ పండుగకు 1000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. బతుకమ్మ పుట్టింది ఆనందంతో కాదు ఆడపిల్లల బాధ నుంచి అనే విషయం చాలామందికి తెలియదు. అయితే.. తమ బాధను తెలియజేసేందుకు ఒకానొకప్పటి కాలంలో మహిళలు వినియోగించుకునే వారట. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయానికి నిలువుటద్దంగా మారిన ఈ బతుకమ్మ పండుగ చరిత్ర ఏంటో తెలుసుకుందాం.
మహిళల ఆక్రందనే ఈ బతుకమ్మ..
అందమైన పువ్వులతో ప్రకృతి పరంగా నిర్వహించే బతుకమ్మ పండుగకు అసలైన కారణం మరొకటి ఉందని చరిత్రకారుల మాట. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో పెత్తందారీ వ్యవస్థ అమలులో ఉండేది. బడుగు బలహీన వర్గాల మహిళలను భూస్వాములు, రాజులు నీచంగా చూసేవారట. వారిపై బలవంతంగా అత్యాచారాలకు పాల్పడడం, క్రూరంగా హింసించడం వంటివి చేసేవారు. భూస్వాముల పెత్తందారి వ్యవస్థలో మహిళలు ఎంతో చితికిపోయారు. వారి బతుకులు అధ్వానంగా తయారయ్యాయి. భూస్వాముల అకృత్యాలకు వారు అనుభవించిన బాధ వర్ణనాతీతం. ఆ నరకయాతన భరించని ఎందరో మహిళలు, ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆనాటి కాలంలో వారి ఆకృత్యాలకు నిరసనగా మహిళలంతా ఒకచోట చేరి తమకు బతుకులేదని.. ప్రకృతి మాతని స్మరిస్తూ తమని మనుషుల్లా చూడాలని బతుకునివ్వాలని కోరుకుంటూ గుండెలవిసే రోదనతో బతుకమ్మ ఆడే వారట. వారి బాధను అర్థం చేసుకోకపోగా.. మరింత రెచ్చిపోయిన పెత్తందారులు ఆడబిడ్డలను వివస్త్రలను చేసి వారితో బతుకమ్మ ఆడించే వారట. ఈ దారుణ అవమానాలను భరించలేని ఎందరో మహిళలు చావే శరణ్యం అనుకున్నారు. ఆ కాలంలో పెత్తందారులు మరింత మితిమీరిపోయి దారుణాలకు ఒడి కట్టేవారు. ఆ కాలంలో చితికిపోయిన మహిళల కన్నీటి గుర్తుగా బతుకమ్మను అనాదికాలంగా ఆడడం ప్రారంభించారు. వారిని తలుచుకొని తోటి మహిళలు బతుకమ్మ అని దీవిస్తూ పాటలు పాడారని చెప్పుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న ఆ మహిళలకు ప్రతీకగా బతుకమ్మను నిర్వహించుకుంటారు. కాలక్రమేనా అదే గొప్ప పండుగగా చరిత్రలో నిలిచిపోయింది. చరిత్రలో ఎన్నో కథనాలు ఉన్నప్పటికీ.. వాస్తవానికి బతుకమ్మ తొలిసారిగా ఆనందంగా నిర్వహించుకున్న పండుగ అయితే కాదని, బాధతో చేసుకున్న పండగ అని పెద్దలు చెబుతున్నారు.
రాష్ట్ర కూటుల కాలంలో…
క్రీస్తుశకం 973లో తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్ర కూటులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా పనిచేసేవారు. ఆ సమయంలో చాళుక్య రాజైన తైలపాడు రాష్ట్రకూట రాజుపై యుద్ధం చేసి తన రాజ్యాన్ని స్థాపించాడు. అయితే ఎక్కువ కాలం జీవించలేకపోయాడు. క్రీస్తు శకం 997లో మరణించాడు. తైలపాడు మరణానంతరం అతని కుమారుడు సత్యాస్రాయుడు రాజ్యాధికారాన్ని చేపట్టాడు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని వారే నిర్మించారు. అక్కడ కొలువుదీరిన రాజేశ్వరి దేవి తమకు అండగా ఉంటుందని ఆ కాలంనాటి ప్రజల నమ్మకం. రాష్ట్ర కూటులు కూడా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించేవారు. పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం కూడా చేశాడు. ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడు. అతని కుమారుడు రాజేంద్రచోళ.. సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. విజయం అనంతరం రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం తమిళనాడు రాష్ట్రంలోని బృహదీశ్వర ఆలయంలో ప్రతిష్ఠించాడు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి మాత నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజలు ఆవేదనకు గురయ్యారు. ఆ కాలంలో పార్వతి మాతను బృహదమ్మగా పిలిచేవారు. ఆమె నుండి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను ఆడడం మొదలుపెట్టారు. శివుడు లేని పార్వతి గురించి పాట రూపంలో తెలియజేస్తూ బతుకమ్మను జరుపుకుంటున్నారు. బతుకమ్మ అనే పేరు పేరు బృహదమ్మ నుంచి వచ్చినది. అమ్మవారిని గౌరమ్మగా కొలుస్తూ పసుపు, కుంకుమ రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను నిర్వహింస్తారు. ఎంగిలి పూలతో మొదలయ్యే బతుకమ్మ సద్దుల బతుకమ్మగా తొమ్మిది రోజులపాటు కొనసాగుతుంది. చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు పూలను నీటిలో నిమర్జనం చేస్తారు.
పురాణ కథనం ప్రకారం…
బతుకమ్మ పండుగ వెనుక మరొక పురాణ కథ ప్రచారంలో ఉంది. పూర్వం అక్కెమ్మ అనే యువతి ఉండేది. ఆమెకు ఏడుగురు అన్నలు. ఆమెను గిట్టని పెద్ద అన్న భార్య పాలల్లో విషం కలిపి మరదలికి తాగించి చంపేసింది. అనంతరం ఊరి బయట పాతి పెట్టింది. ఆ ప్రదేశంలో అక్కమ్మ అడవి తంగేడు చెట్టుగా పుట్టి విరగబూసింది. ఊరి నుండి వచ్చిన అన్నలు చెల్లెకు ఆ పువ్వులు ఇద్దామని వెళితే ఆ ప్రదేశం నుండి ఆమె ఆత్మ తన మరణం గురించి అన్నలకు చెబుతుంది. చెల్లెలికి ఏం కావాలో కోరుకొమ్మని ఆ అన్నలు వరం అడుగుతారు. ఈ తంగేడు పూలలో తనను చూసుకోమని, ప్రతి ఏటా బతుకమ్మ పేరుతో పండగ చేయండని చెప్పిందట. అలా ఈ పండుగ మొదలైందని పెద్దలు చెబుతారు. మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. సంతానం లేని ఓ దంపతులకు అడవిలో ఓ చిన్నారి దొరుకుతుంది. ఆ చిన్నారిని అమ్మవారి ప్రసాదంగా భావించిన ఆ దంపతులు కన్న బిడ్డ వలె పెంచి పెద్ద చేస్తారు. ఇక ఆ బాలిక మహిమలు చూపిస్తూ, లోకహిత కార్యాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతుంది. బతుకమ్మగా గౌరీ దేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతుంది. అప్పటి నుండి బతుకమ్మగా.. గౌరీదేవిని పూజిస్తున్నారు.