భారత్ సమాచార్.నెట్: జమ్మూకశ్మీర్(Jammu & Kashmir) లోని పహల్గామ్ (Pahalgam)లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో (Pakistan Cricket team) ద్వైపాక్షిక సిరీస్‌లు (Bilateral Series) ఆడబోమని తేల్చి చెప్పింది. ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ.. ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇకపై పాకిస్థాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. “మేము పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడము. బాధితులకు మద్దతుగా నిలుస్తాము. ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ప్రభుత్వం ఏం చెప్పినా అలాగే చేస్తాం.” అని పేర్కొన్నారు. అయితే ఐసీసీ ఈవెంట్ల విషయానికొచ్చేసరికి అంతర్జాతీయ క్రికెట్ మండలిని గౌరవిస్తూ తటస్థ వేదికలపై ఆడుతున్నాం. ఇప్పుడు దేశంలో జరిగిన దానిపై ఐసీసీకి అవగాహన ఉందనుకుంటున్నా అని ఆయన పేర్కొన్నారు.
ఇకపోతే భారత్, పాకిస్థాన్ చివరిసారిగా 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ ఆడాయి. అప్పుడు పాకిస్థాన్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్‌కు వచ్చింది. భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించింది. అప్పుడు టీమిండియా ఆసియా కప్‌లో పాల్గొంది. అయితే 2005-06 తర్వాత భారత జట్టు ద్వైపాక్షిక సిరీస్ కోసం పాకిస్థాన్‌ను సందర్శించలేదు. ఇదిలా ఉంటే ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫి సందర్భంగా దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియా భారీ తేడాతో గెలిచింది.