భారత్ సమాచార్.నెట్: బెంగుళూరు తొక్కిసలాట (Banglore Stampede) ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Cm Siddaramaiah)ను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కొందరు పోలీసులు, అధికారులను బలిపశువులు చేసేందుకు కూడా వెనకాడటం లేదు. ఇదే తరహా ఘటన హైదరాబాద్ (Hyderabad)లో జరిగినప్పుడు సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun)ను జైలుకి పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతకు మించిన తీవ్రమైన సంఘటన బెంగళూరులో జరిగినప్పటికీ.. గొడవకు మూలం అయిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఒక్క మాట కూడా అనడం లేదు ఇదే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని చెబుతున్నారు.
ఇప్పుడు ఇదే విషయంపై ట్రోలింగ్ నడుస్తోంది. సుమారు ఆరు నెలల క్రితం సికింద్రాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ఫ 2 సినిమా రిలీజ్ సందర్బంగా తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అన్న టాక్ రాగానే, హీరో అల్లు అర్జున్ ఆనందాన్ని పట్టలేక జనంలోకి వచ్చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా.. సినిమా థియోటర్‌కు రావటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో చాలా మందికి తీవ్ర గాయాలు కాగా.. ఓ మహిళ మరణించింది. అంతేకాకుండా మరణించిన మహిళ బిడ్డాకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నాడు. ఇది నిజంగానే చాలా బాదాకరమైన విషయం. సెలబ్రిటీల హడావుడి సామాన్యుడి ప్రాణాల మీదకు రావటం క్షమించరాని విషయం.
దీనిని ఆసరాగా తీసుకుని కాంగ్రెస్ పెద్దలు హడావిడిగా అడుగులు వేశారు. అప్పటికప్పుడు కేసులు పెట్టించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. హీరో అల్లు అర్జున్ వల్లనే ఇదంతా జరిగింది అంటూ ఆగ మేఘాల మీద అరెస్టు చేసి జైలుకి పంపించారు. కోర్టుకి వెళ్లి బెయిల్ తెచ్చుకొనే అవకాశం ఉన్నప్పటికీ, ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జైలులో కూర్చోపెట్టారు. ఈ సంఘటనలో తప్పంతా అల్లు అర్జున్ బ్యాచ్‌దే అని రుజువు చేసేందుకు తాపత్రయ పడ్డారు. దీనికి అల్లు అర్జున్ బహిరంగ క్షమాపణ చెప్పటంతో పాటు, బాధితులకు వైద్యం ఖర్చు అంతా ఆయన కుటుంబమే భరించింది. ఈ సంఘటన అప్పట్లోనే జాతీయ స్థాయిలో సంచలనం రేపింది.
తర్వాత కూడా అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించింది. సినిమా పరిశ్రమ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని పెద్దలను పట్టించుకోవడంలేదని హడావిడి కూడా చేసింది. సామాన్యుల మాన ప్రాణాలను కాపాడటమే తమ విద్యుక్త ధర్మం అంటూ ప్రకటనలు గుప్పించారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు అందుకు కారకులైన వారి మీద కఠిన సెక్షన్‌లు నమోదు చేసి మరి కేసులు పెడతామంటూ కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు.
ఇక, ఇప్పుడు బెంగళూరు తొక్కిసలాట ఘటనను చూద్దాం. ఐపీఎల్ సీజన్ 18 కప్‌ను 17 ఏళ్ల నిరిక్షణ తర్వాత బెంగళూరు జట్టు దక్కించుకుంది. 17 సంవత్సరాల తర్వాత కప్ గెలవగానే, అర్థరాత్రి పూటే బెంగళూరు వీదుల్లో సంబరాలు హోరెత్తిపోయాయి. దీనిని బట్టే అక్కడ భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మర్నాడే బెంగళూరులో విజయోత్సవాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం తొందర పడింది. క్రీడాకారుల కష్టార్జితాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ వేసుకొన్నారు. ఇదే విషయాన్ని కర్నాటక రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో చొరవ తీసుకొన్నది స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే అని ఆధారాలతో సహా బయట పెట్టారు.
ఆ రోజు సిద్ధ రామయ్య టీమ్ చేసిన హడావుడి తెలుసుకొంటే.. మొత్తం అంతా అర్థం అయిపోతుంది. సహజంగా ఇలాంటి సందర్భాలలో పోలీస్ కమిషనర్ లేక రాష్ట్ర డిజిపి స్వయంగా ముఖ్యమంత్రి లేక హోమంత్రిని కలిసి పరిస్థితిని వివరిస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఉదయం 10 గంటలకు… పోలీస్ కమీషనర్.. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లిన సందర్భంగా ఆ రోజు సంబరాలు జరిపితే జనాన్ని నియంత్రించడం కష్టం అవుతుందని తెలిపారు. అయితే, సీఎంఓ నుండి ఒక అధికారి, మరో వంక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల ద్వారా ఆర్సీబీ వత్తిడి తెచ్చిన్నట్లు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ఉదయం 7 గంటలకే సంబరాల గురించి, ర్యాలీ గురించి సోషల్ మీడియా ద్వారా ఆర్సీబీ ప్రకటించింది. ముఖ్యంగా విధాన సౌధ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీ జరప వద్దని స్థానిక డీసీపీ లిఖితపూర్వకంగా ఆదేశించారు. అయినప్పటికీ సిద్ధరామయ్య వర్గం ఏ మాత్రం లెక్క చేయకుండా ఆర్సీబీకి సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపించింది.
అప్పటికే బెంగళూరులో అర్ధరాత్రి సంబరాలు హోరెత్తి పోయాయి. దీని మీద స్థానిక పోలీసు అధికారులు ఉన్నతాధికారులకు తమ నివేదికను అందజేశారు. తెల్లారేసరికి విజయోత్సవం మొదలుపెడితే యూత్‌ని కంట్రోల్ చేయడం కష్టం అన్న సంగతి పోలీసు అధికారులకు అర్థమైపోయింది. అందుచేత హడావిడిగా విజయోత్సవం వద్దు అంటూ పోలీసులు అంతర్గతంగా ఒక అంచనాకు వచ్చారు. బెంగళూరు నగరంలో ముఖ్యంగా విధాన్ సౌధ్ దగ్గర ర్యాలీ లేదని 12 గంటలకు పోలీసులు ప్రకటించారు. అయినా సిద్దూ టీమ్ మరియూ ఆర్సీబీ మాత్రం విజయోత్సవ ర్యాలీ ఉందంటూ ప్రచారం హోరెత్తించాయి. వాస్తవానికి అంత తొందరగా మరుసటి రోజే సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం లేదు. కప్ గెలుస్తామని ముందుగా అంచనాలు లేకపోవడంతో, సంబరాలకు సన్నాహాలు ముందుగా చేసుకున్న దాఖలాలు లేవు. అనుకోకుండా కప్ రావడంతో భావోద్వేగంతో ఇటువంటి సంబరాలకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నది.
ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఆర్సీబీ వర్గాలతో కమర్షియల్ సంబంధాలు ఉన్నాయి. అన్నది వాస్తవం. ఆర్సీబీ ఇప్పటివరకు కప్ గెలవలేకపోయినా దేశంలో మరే ఐపీఎల్ టీంకు లేనంతటి క్రేజ్ సంపాదించుకుంది. అందుకనే ఎప్పుడూ కప్ గెలవలేక పోయినా వ్యాపారపరంగా ముంబై, చెన్నై, కోల్కతాలకు మించిన స్పాన్సర్స్‌ను సంపాదించి భారీగా ఆదాయం పొందుతున్నారు. ఆదాయం మీదున్న ఆసక్తి సంబరాల నిర్వహణకు తగు ప్లాన్ చేయడంలో లేకపోవడంతో ఇటువంటి దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ విజయోత్సవం భారీగా జరపటం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం కొట్టేయాలని ప్లాన్ చేయటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకొంది.
దీంతో ఈ ఘటన మీద ప్రభుత్వం తరఫునుంచి తలో రకమైన వాదన మొదలైంది. 11 మంది చనిపోయినప్పటికీ.. ఈ ర్యాలీకి కారణమైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌ల మీద ఏమాత్రం చర్యలు లేవు. ర్యాలీ వద్దు మొర్రో అని మొత్తుకొన్న పోలీసు అధికారులను మాత్రం సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు. హైదరాబాద్‌లో తొక్కిసలాటకు మూలం అంటూ హీరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేసినప్పుడు.. ఈ ఘటనలో కూడా తొక్కిసలాటకు మూలం అయిన సిద్ధరామయ్యను అరెస్టు చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద బెంగుళూరులో సిద్ధరామయ్య డీకే శివకుమార్‌లకు ప్రభుత్వం కొమ్ము కాస్తోంది. అందుచేత వారి మీద ఈగ కూడా వాలకుండా జాగ్రత్తలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతికి ఇది ఉదాహరణ అని అర్థమవుతోంది. అయినప్పటికీ కాంగ్రెస్ పెద్దలు ఏమాత్రం తగ్గటం లేదు.
Share This Post