భారత్ సమాచార్, వైజాగ్ ;
కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక కారణాలతో కొంత మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, మల్టీ నేషనల్ కంపెనీల ఉద్యోగుల ఫోర్ వీలర్ వాహనాలకు మాత్రమే బీహెచ్ (BH) సిరీస్ తో వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో కొంత మేర వారికి టాక్స్ తగ్గే అవకాశం కూడా ఉంది. దీన్ని అవకాశంగా మార్చుకొని కొందరు డీలర్లు కొత్త రిజిస్ట్రేషన్ విధానంతో కొత్తరకం స్కామ్ చేశారు.
వీరి మాయాజాలం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన రవాణా శాఖ అధికారులు, అటు డీలర్లు, ఇటు వినియోగదారులకు షాక్ ఇచ్చారు.
సాధారణ వినియోగదారులు చెల్లించాల్సిన 17 శాతం లైఫ్ టాక్స్‌కు పక్క దారి మళ్లించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కొందరికి మాత్రమే అవకాశం ఉండే BH రిజిస్ట్రేషన్ మినహాయింపు లను నొక్కేశారు. కేవలం 4 శాతం టాక్స్ జమ చేస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు కొందరు డీలర్లు. దీంతో విషయం తెలుసుకున్న రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టి చర్యలకు సిద్ధమయ్యారు.
నకిలీ పత్రాలతో వాహనాలను BH సిరీస్‌లో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించిన డీలర్ల ఆధరైజేషన్‌ను సస్పెండ్ చేశారు రవాణా శాఖ అధికారులు. మోసానికి పాల్పడుతున్న త్రై స్టార్ మోటార్స్, వరుణ్ మోటార్స్, శివశంకర మోటార్స్ ఆథరైజేషన్‌ను సస్పెండ్ చేశామని, మరో 16 మంది డీలర్లకు నోటీసులు ఇచ్చామని మీడియాకి వివరించారు. అలా అక్రమంగా BH రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి 17 శాతం లైఫ్ టాక్స్ కట్టిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో నివాసం ఉంటున్న వారికి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నివాసం ఉంటున్నట్లుగా, కేంద్ర ప్రభుత్వ, మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగులుగా తప్పుడు నివాస, ధృవీకరణ పత్రాలను సృష్టించి తద్వారా వాహనాలను ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారు.
మరోవైపు ధర తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ రకంగా కార్లను కొనుగోలు చేసిన వినియోగదారులు అధికారుల చర్యలతో షాక్ కి గురవుతున్నారు. డీలర్లు చేసిన తప్పులకి మేము శిక్ష అనుభవిస్తున్నామని వాపోతున్నారు.