భారత్ సమాాచార్.నెట్: టిబెటన్‌ల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ అందించాలని కోరుతూ ఆల్ పార్టీ ఫోరమ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దలైలామాకు భారత్ పార్లమెంటులో ప్రసంగించే అవకాశం కల్పించాలని కోరింది. ఈ మేరకు ఆల్ పార్టీ ఇండియన్ పార్లమెంటరీ ఫోరం పర్ టిబెట్ పేరుతో ఈ లేఖ రాసింది. ఇందులో బీజేపీ, బిజూ జనతాదళ్, జనతాదళ్ యునైటెడ్ వంటి పలు పార్టీల ఎంపీలు సభ్యులుగా ఉన్నట్లు సమాచారం.
దలైలామాకు భారతరత్న ఇవ్వాలన్న నామినేషన్‌కు మద్దతుగా సంతకాలను సేకరించేందుకు ఇటీవల 10 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే రెండు సార్లు సమావేశమైన ఈ ఫోరమ్ దలైలామాకు భారత్ రత్న ఇవ్వాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 80 మంది ఎంపీల సంతకాలు ఇప్పటికే సమకూరాయి. ఈ సంతకాలను త్వరలోనే రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి పంపించనున్నారు.
అలాగే ఈ విషయమై లోక్‌సభ స్పీకర్‌కు, రాజ్యసభ ఛైర్మన్‌కు కూడా ప్రత్యేకంగా లేఖలు రాసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు, బౌద్ధమత ప్రచారంలో విశేష సేవలందించిన దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పలు దేశాల ప్రతినిధులు, టిబెటన్లు, బౌద్ధులు, రాజకీయ నేతలు హాజరయ్యారు.
Share This Post