భారత్ సమాచార్.నెట్: ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలోనే చార్‌ధామ్ యాత్రకు బ్రేక్ పడింది. చార్‌ధామ్ యాత్రను మరో 24 గంటలు వాయిదా వేశారు.
భారీ వర్షాల హెచ్చరికలు ఉన్నందున యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. యాత్రికులను హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, వికాస్‌నగర్లలో నిలిపివేయాలని పోలీసులు, పరిపాలన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర వాయిదా పడుతుందని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, ఉత్తరకాశి జిల్లాలోని బార్కోట్-యమునోత్రి రోడ్డులోని సిలై బ్యాండ్‌లో క్లౌడ్ బరస్ట్ అయ్యింది. ఇక్కడ నిర్మాణంలో ఉన్న హోటల్ స్థలంలో నివసిస్తున్న తొమ్మిది మంది కార్మికులు గల్లంతయ్యారు.
ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే వారం రోజులపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్ తదితర రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ యంత్రాంగం కూడా అత్యవసర ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించింది.