భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్‌షీట్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆదివారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు విడుదల చేయనున్నారు. హామీల అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయటంలో విఫలమైందని, కాంగ్రెస్ సర్కార్ తీరును అసెంబ్లీలో.. ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని గులాబీ పార్టీ నిర్ణయిందని ఆయన స్పష్టం చేశారు.
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం:
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం (ఆర్‌ఆర్‌ఆర్)లో భాగంగా తక్కువ ధరకే తమ భూములను లాక్కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని పలువురు బాధితులు హరీష్ రావును కలిసి తమ గోడును చెప్పుకున్నారు. ఈ మేరకు పుప్పాల్‌గూడలో ఆయన నివాసంలో హరీశ్‌రావును కలిసి తమ సమస్యలను విన్నవించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఆర్ విషయంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధితులకు న్యాయం చేయకపోతే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం దివ్యాంగులకు ఇస్తున్నరూ. 4,016 పెన్షన్‌ను రూ.6వేలకు పెంచాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈనెల 26న జరగనున్న దివ్యాంగుల మహా ధర్నాకు తాను తప్పనిసరిగా హజరవుతానని తనను కలిసిన దివ్యాంగుల సంఘం నాయకులకు ఆయన హమీ ఇచ్చారు.
ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న కేసీఆర్:
మరోవైపు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభల్లో బీఆర్ఎస్ నేతలు అవలంభించాల్సిన వ్యూహ్యాంపై సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఇంకొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నారన్న ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ భరోసా ఇవ్వనున్నారు.