భారత్ సమాచార్.నెట్: కేంద్ర మంత్రి, నటుడు సురేశ్ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ’. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ‘సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. ఈ చిత్రంలో జానకిగా అనుపమా పరమేశ్వరన్, లాయర్‌గా సురేశ్ గోపి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. ‘జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను నిరాకరించింది. దీంతో ఈ అంశం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీతాదేవికి మరొక పేరు అయిన ‘జానకిని’.. అలాంటి పాత్రకు పెట్టకూడదని సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని దర్శకుడు కూడా వెల్లడించారు.
ఇక ఇదే విషయంపై ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ప్రధాన కార్యదర్శి, దర్శకుడు ఉన్ని కృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ సినిమాలో జానకి అనే పేరు ఉపయోగించరాదని సెన్సార్ బోర్డు స్పష్టంగా చెప్పింది. టైటిల్, పాత్ర పేరును మార్చాలని సూచించింది. సీతాదేవి పేరును ఒక దాడికి గురైన మహిళా పాత్రకే పెట్టడానికి వీలులేదని బోర్డు తెలిపిందని చెప్పారు. తాజాగా మరో మలయాళ చిత్రం ఇదే సమస్యను ఎదుర్కొంది. అందులోని జానకి పాత్ర పేరును సెన్సార్ అనుమతించకపోవడంతో, నిర్మాతలు ‘జయంతి’గా మార్చి సర్టిఫికెట్ పొందారు.
Share This Post