భారత్ సమాచార్, జాతీయం ;
మనిషి హక్కులకు సంబంధించిన ప్రతి వ్యవస్థలోనూ లోపాలుంటాయి. వాటిని అధిగమిస్తూ ముందుకు పోవాలంతే కానీ, ఉన్న చోటే కూర్చొని వాటిని విమర్శింస్తూ… వాటితోనే సహజీవనం సాగిస్తూ… అలాగే ఉండిపోకూడదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజా రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న పోలీసు వ్యవస్థ సాధారణ ప్రజలకు కల్పిస్తున్న రక్షణ ఎలాంటిదో అందరికి తెలిసిందే. అట్టడుగు, బలహీన, పేద వర్గాల ప్రజలు ఇప్పటికీ తమ న్యాయం కోసం కానీ, రక్షణ కోసం కానీ పోలీసు స్టేషన్ కి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. నేటి సమాజంలో కూడా కొన్ని చోట్ల ఖాకీల చేతుల్లో పౌర హక్కులు నలిగిపోతున్నాయి. కొంతలో కొంత సాధారణ పౌరులకు పోలీసు వ్యవస్థ పై విశ్వాసం కలిగించేందుకు సుప్రీం కోర్టు తాజాగా దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. సీసీ కెమెరాలతో పోలీసు వ్యవస్థ మొత్తం మారిపోయి అందరికి సమ రక్షణ, న్యాయం దొరుకుతాయని కాదు… ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత సాయంతో సమన్యాయం వైపు మరో మెట్టు ముందడుగు వేయటానికి.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లలో దారుణమైన అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి అనటంలో సందేహం లేదు. అధికారం ఉన్నవారికి.. డబ్బులు ఉన్నవారికి పోలీసులు కొమ్ముకాస్తూ.. సామాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు మాత్రం నేటికి పోవటంలేదు. కొన్ని పీఎస్ లు ఏకంగా సెటిల్ మెంట్ల కు అడ్డాగా మారుతున్నాయని విమర్శలున్నాయి. లాకప్ డెత్, బెదరింపులు, వసూళ్లు, అక్రమార్కులకు అండదండగా ఉంటున్నారనే ఆరోపణలతో ఆ వ్యవస్థ పై నమ్మకం లేని పరిస్థితి సాధారణ పౌరులకు నెలకొంది. కొన్ని స్టేషన్‌లలో మాటల్లో చెప్పలేని ఘోరాలు కూడా జరగుతున్నాయి. ఇలా పీఎస్ లలో జరిగేది ప్రతీదీ పారదర్శకంగా ఉండాలనే ఉద్ధేశ్యంతో, తద్వారా సామాన్యులకు న్యాయం జరగాలనే యోచనతో పీఎస్ ల విషయంలో సుప్రీం కోర్టు జూలు విదిలించింది. సీసీ కెమెరాలకు సంబంధించిన పనులు ఎంత వరకూ జరిగాయో తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా ఆదేశించింది.