భారత్ సమాచార్.నెట్: ప్రస్తుతం దేశంలో యూపీఐ పేమెంట్స్ (UPI Payments) గురించి తెలియని వారు ఉండరు. ప్రతి ఒక్కరూ యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్స్ (Digital Payments)ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. చిన్నపాటి కొనుగోల నుంచి పెద్ద లావాదేవీల వరకు అందరూ గుగూల్ పే (Google pay), ఫోన్ పే (Phone pe) వంటి యూపీఐ ఆధారిత అప్లికేషన్‌లను ఉపయోగించి డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే యూపీఐ పేమెంట్ల ద్వారా జరిగే లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్(MDR) పేరుతో ఛార్జీలు వసూల్ చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ క్రమంలోనే ఈ ప్రచారంపై కేంద్రం స్పందించింది. యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ వసూలు చేస్తారంటూ వచ్చిన ఊహాగానాలు, వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవని కేంద్ర ఆర్థిక శాఖా పేర్కొంది. ఇలా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేసింది.
భారీ స్థాయి యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో పలు కథనాలు వెలువడ్డాయి. ఆన్‌లైన్ లావాదేవీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఖర్చులను నిర్వహించడంలో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని.. అందులో భాగంగానే రూ.3000 కన్నా ఎక్కువ విలువగల యూపీఐ లావాదేవీలపై ఈ ఛార్జీలు వర్తింపజేస్తారన్న ఊహాగానాలు వెలువెడిన సంగతి తెలిసిందే.
Share This Post