August 2, 2025 11:40 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

CBN ఆటోలో ప్రయాణించిన చంద్రబాబు.. ఎందుకో తెలుసా..?

భారత్ సమాచార్.నెట్, కడప జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా జమ్మలమడుగు పర్యటనలో వినూత్న రీతిలో ప్రయాణించారు. శుక్రవారం కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన ప్రజావేదిక వద్దకు చంద్రబాబు నాయుడు ఆటోలో చేరుకున్నారు. ‘పేదల సేవలో’ పేరుతో జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా బాబు చేసిన ప్రయాణం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఓ వితంతు పెన్షన్ లబ్ధిదారైన అలివేలమ్మను ఆమె ఇంటికి వెళ్లి స్వయంగా కలిశారు. ఆమె కుటుంబ సభ్యులతోపాటు ఇంట్లోని పరిస్థితులను కూడా స్వయంగా చూసి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిని ఆప్యాయంగా ఆహ్వానించిన అలివేలమ్మ తనకు ఇద్దరు కొడుకులు ఉన్నారని, చిన్న కొడుకు జగదీష్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తుండగా, పెద్ద కొడుకు వేణుగోపాల్ తనలాగే చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడని తెలిపారు.

అండగా ఉంటా.. అధైర్య పడొద్దు:
అలివేలమ్మ నిత్య జీవితంలో ఎక్కువ సమయం గడిపే తన నూలు నేసే యంత్రాన్ని ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సందర్భంగా మీకే సహాయం కావాలని ముఖ్యమంత్రి అడగగా.. ఆమె తన చిన్న కుమారుడైన జగదీష్‌కు ప్రభుత్వ శాఖల్లో డ్రైవర్ పోస్టును కల్పించాల్సిందిగా కోరారు. మరోవైపు తన ఇంటికి పైకప్పు (స్లాబ్) వేయడానికి ఆర్థిక సహాయం అందించాలని అభ్యర్థించారు. ఈ మేరకు అవసరమైన అన్ని సహాయాలు ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పెన్షన్ పంపిణీ అనంతరం, జగదీష్ అభ్యర్థన మేరకు సీఎం చంద్రబాబు ఆటోలో ప్రయాణించేందుకు అంగీకరించారు. అలివేలమ్మ ఇంటి వద్ద నుంచి సభ వేదిక వరకు జగదీష్ ఆటోలో ప్రయాణించారు. సీఎం అక్కడే ఆ ఆటోలో డ్రైవర్ సీటులో జగదీష్ పక్కన కూర్చొన్నారు. ప్రజావేదికకు చేరుకున్న తర్వాత జగదీష్, “ఈ క్షణం జీవితాంతం మర్చిపోలేను” అంటూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రజావేదిక వద్ద ముఖ్యమంత్రి ప్రససంగించారు.

Share This Post