భారత్ సమాచార్.నెట్: కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్ స్థానంలో జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానంతో కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరిగేందుకు తోడ్పడింది. అయితే ఇప్పటికే ఆదాయ పన్నుల రాయితీల రూపంలో ఉపశమనం కల్పించిన కేంద్రం.. ఇప్పుడు పేదలపై కూడా దృష్టి పెట్టింది. జీఎస్టీ తగ్గించాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఇప్పటి వరకు జీఎస్టీ వసూళ్లలో ఉన్న నిబంధనలను మార్పు చేస్తున్నట్టు తెలుస్తోంది.
12 శాతం జీఎస్టీ స్లాబ్‌ను పూర్తిగా తొలగించడం లేదా 12 శాతం పన్ను విధించబడే వస్తువులను 5 శాతంలోకి చేర్చడం వంటి అంశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల మధ్యతరగతి, ఆర్థికంగా బలహీన వర్గాలు ఉపయోగించే టూత్ పేస్ట్, టూత్ పౌడర్, గొడుగులు, కుట్టు మిషన్లు, ప్రెషర్ కుక్కర్లు, వంటగది పాత్రలు, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్, గీజర్లు, చిన్న సామర్థ్యం గల వాషింగ్ మెషిన్లు, స్టేషనరీ వస్తువులు, టీకాలు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ ఉపకరణాలు తదితర వస్తువుల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.
మార్పులు అమలు చేస్తే ఈ వస్తువులు చాలా వరకు తక్కువ ధరకే వస్తాయి. రేట్లను తగ్గించటం ద్వారా అమ్మకాలు పెరుగుతాయని ఆర్థిక వ్యవస్థలో కొనుగోళ్లు పెరిగి దీర్ఘకాలంలో జీఎస్టీ వసూళ్లు కూడా పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. కాగా ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీనికి అనుగుణంగానే జీఎస్టీ రేట్లలో కీలక మార్పులు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోని మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ భారం తగ్గింపుతో రిలీఫ్ ఇచ్చేందుకు తాము తీవ్రంగా కృషి చేస్తున్నట్లు నిర్మలమ్మ పేర్కొన్నారు.
Share This Post