భారత్ సమాచార్, ఏఐ న్యూస్ ;
ప్రతి ఏటా క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వాట్సప్ ద్వారా సర్టిఫికెట్ పొందే పద్ధతిని ఏపీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే వివిధ రకాల బిల్లులు కూడా వాట్సప్ ద్వారా చెల్లించేయవచ్చు. ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్ స్టా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ప్రపంచమంతా విస్తరించిన మెటాతో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నారా లోకేష్ ఒప్పందం కుదుర్చుకోనున్నారు. మెటా ఫ్లాట్ ఫాం వాట్సప్ బిజినెస్ ద్వారా ఇకపై క్యాస్ట్, ఇతరత్రా సర్టిఫికెట్లు వేగంగా, సులభంగా పొందేందుకు వీలు అవుతుంది. అలాగే నకిలీలు, ట్యాంపరింగ్ అవకాశం లేకుండా పారదర్శకంగా ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్ల జారీ ఉంటుంది. మెటా నుంచి కన్సల్టేషన్ టెక్నికల్ సపోర్ట్, ఈ గవర్నెన్స్ అమలు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా మరిన్ని సిటిజెన్ సర్వీసెస్ ఏపీ ప్రభుత్వానికి అందించేలా మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏపీ అధికారులు, మెటా ప్రతినిధులు ఢిల్లీ లోని జన్పథ్ లో జరిగిన కార్యక్రమంలో ఎంవోయూ చేసుకున్నారు. మెటాతో ఎంవోయూ ఒక చారిత్రాత్మకమైన మైలురాయి అని మంత్రి లోకేష్ అభివర్ణించారు. యువగళం పాదయాత్రలో విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ సర్టిఫికెట్ల కోసం పడుతున్న కష్టాలు ప్రత్యక్షంగా చూసి.. మొబైల్‌లోనే ఆయా సర్టిఫికెట్లు అందిస్తాం అని హామీ ఇచ్చాను. మాట ఇచ్చినట్టే నేడు మెటాతో ఒప్పందం ద్వారా వాట్సప్‌లోనే సర్టిఫికెట్లు, పౌరసేవలు పొందేలా మెటాతో ఒప్పందం చేసుకున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు ఆన్‌లైన్‌లో అతి సులువుగా, పారదర్శకంగా, అతి వేగంగా పొందే ఏర్పాట్లు చేస్తాం“ అని ఐటీ మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చాలా సంతోషం- మెటా ఇండియా
మెటాలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సేవలను వాడుకుని వాట్సప్ ద్వారా ఏపీ ప్రజలకు పౌర సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సంధ్యా దేవనాథన్, వైస్ ప్రెసిడెంట్, మెటా ఇండియా ప్రకటించారు. అందరూ తమకు కావాల్సిన సేవలు పొందేందుకు వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, వాట్సప్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ ఉంటుందని, మా డిజిటల్ టెక్నాలజీని వాడుకుని ఏపీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మరిన్ని ఉత్తమసేవలు అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.