భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల ప్రజాపాలనను అందించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీట్ ద మీడియా కార్యక్రమాన్ని నేడు నిర్వహించారు. ‘‘వంద రోజుల పరిపాలన నాకు పూర్తి సంతృప్తినిచ్చింది. ఈ వందరోజుల్లో ప్రతి నిమిషం ఆరు గ్యారంటీల అమలుకు కృషి చేసాం. వంద రోజుల పాలనతో సమస్యలన్నీ పరిష్కారమైనట్టు భావించడం లేదు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు, ఒక‍్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం ” అని రేవంత్ అన్నారు.
2023లో ప్రజలంతా అద్భుతమైన తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ వచ్చాక కూడా కేసీఆర్ రాచరికపు పోకడలు అనుసరించారని ఆరోపించారు. రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని మన నెత్తిన రుద్దాలని కేసీఆర్ చూశారన్నారు. ప్రశ్నిస్తే అణచి వేయాలని ప్రయత్నించారు. బీఆర్ఎస్ బానిసత్వాన్ని ప్రజలు వ్యతిరేకించారని తెలిపారు.
ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే అసలు నిజాలు బయటపడతాయన్నారు. తప్పులకు కారణమైనవారిని వదిలిపెట్టమన్నారు. కొండలు, గుట్టలు, లేఅవుట్లకు రైతుభరోసా ఇచ్చేది లేదని వెల్లడించారు. నిధుల దుర్వినియోగం జరగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. దుబారా, ఆర్భాట ఖర్చులు పెట్టేది ఉండదన్నారు. జీఎస్టీ ద్వారా ఖజానాకు ఆదాయం పెంచుకుంటమన్నారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్‌లను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాంటివాటిపై దృష్టిపెట్టి ఆదాయం పెంచుతామన్నారు.
‘‘ఇవాళ గేట్లు ఓపెన్ చేశా, అవతల ఖాళీ అయితే, అటో మేటిక్‌గా గేట్ క్లోస్ అవుతది’’అని ముఖ్యమంత్రి అన్నారు. అంతకు ముందు…
సీఎం రేవంత్, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి , ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.