భారత్ సమాచార్, అంతర్జాతీయం : ‘‘ఈ రేయి తీయనిది.. ఈ చిరుగాలి మనసైనది.. ఈ హాయి మాయనిది..ఇంతకుమించి ఏమున్నది..’’ అంటూ ఈ రోజు రాత్రికి మేడపై పడుకొని చల్లని గాలిని ఆస్వాదిస్తూ మంచి కూనిరాగం తీస్తూ చల్లటి నిండు చందురుడిని చూసుకుంటూ సుదీర్ఘమైన రాత్రిని ఎంజాయ్ చేయండి మరి. డిసెంబర్ 27(బుధవారం) రాత్రి చల్లని చంద్రుడు (కోల్డ్ మూన్), లాంగెస్ట్ నైట్ ( సుదీర్ఘ రాత్రి) కనువిందు చేయబోతోంది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించి, ఆస్వాదించాలని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రపంచ ప్రజానికానికి సూచిస్తున్నారు.
ఈ అనంత విశ్వంలో వింతలు విశేషాలు ఎన్నో ఉంటాయి. ఈ విశ్వం గురించి మనకు తెలిసింది పిసరంతా.. తెలియాల్సింది కొండంతా ఉంది. విశ్వం గుట్టును తేల్చడానికి శాస్త్రవేత్తలు ఎన్నో ఏండ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. మనకు అత్యంత దగ్గరలోని చంద్రుడి పైకే మనం ఒక్కసారి మాత్రమే అడుగుపెట్టాం. చంద్రుడి గురించి ఇంకా చాలా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇంకా చందమామ గురించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అలాగే విశ్వంలోని ఇతర గ్రహాలు, నక్షత్రాలు, విశ్వం పుట్టుక.. ఇవన్నీ కూడా మానవాళికి ఎంతో ఆసక్తిరేకిత్తించే అంశాలు. ఖగోళ రహస్యాలను తెలుసుకోవడానికి, ఖగోళ వింతలను ఆస్వాదించడానికి మనం ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తుంటాం. అలాంటిదే కోల్డ్ మూన్ దృశ్యం కూడా..
ఈ ఏడాది చివరి పౌర్ణమి సందర్భంగా చంద్రుడు సంపూర్ణంగా అంటే దాదాపు 99.5 శాతం కనిపించనున్నాడు. దీన్నే కోల్డ్ మూన్ అని పిలుస్తారు. అలాగే సుదీర్ఘమైన రాత్రి ఉండబోతోంది. రేపు ఉదయం 6.03గంటల వరకు చంద్రుడు కనిపించి సందడి చేయనున్నాడు. సంపూర్ణ పౌర్ణమిని చూడడానికి సరైన టైమ్ తెల్లవారుజామే అని సైంటిస్టులు చెపుతున్నారు. భూమి నార్త్ పోల్ సూర్యుడికి బాగా దూరంగా ఉన్నప్పుడు ఇది సంభవిస్తుందని వారు అంటున్నారు. ఈ ఏడాది జూన్ 21, డిసెంబర్ 21న కూడా లాంగెస్ట్ నైట్ కొనసాగింది. ఇవాళ రాత్రి సంభవించేది మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి.