భారత్ సమాచార్.నెట్: భారత్-పాకిస్థాన్ (India-Pak) మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు హైదరాబాద్ (Hyderabad)పై ప్రభావం చూపుతున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) కీలక ఆదేశాలు జారీ చేశారు. సిటీ వ్యాప్తంగా టపాసులు (Crackers) కాల్చటంపై నిషేధం (Banned) విధించారు. అంతేకాదు టపాసుల అమ్మకాలపై కూడా ఈ నిషేధం అమలులో ఉండనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బాణసంచా శబ్దాలు ప్రజల్లో అనవసర భయాందోళనలు రేకెత్తించవచ్చని.. పేలుళ్ల శబ్దాలను తలపించి గందరగోళానికి దారితీయవచ్చని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు.. అవాంఛనీయ పరిస్థితులను నివారించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నగరంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడటం.. పౌరుల భద్రతకు భరోసా కల్పించడమే ఈ నిషేధం ముఖ్య ఉద్దేశామన్నారు.
ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని.. దాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. సాధారణంగా పండుగలు, వేడుకల సందర్భంగా బాణాసంచా కాల్చడం హైదరాబాద్‌లో సాధారణమే అయినా.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఈ నిషేధాన్ని పాటిస్తూ పోలీసులకు సహరించాలని కోరారు. దేశంలో పరిస్థితులు చక్కబడే వరకు ఈ నిషేధం కొనసాగే అవకాశం ఉంది.
Share This Post