భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నప్పటికీ సభను సజావుగా సాగనివ్వడం లేదు విపక్షాలు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, బీహార్ ఓటర్ల జాబితా అంశంపై చర్చకు పట్టుబడతున్నాయి ప్రతిపక్షాలు. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్‌పై చర్చ నిర్వహించనున్నారు. తాజాగా సమావేశమైన పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఈ అంశంపై ఉభయ సభల్లో చర్చకు అంగీకరించింది.
అయితే ప్రధాని మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో ప్రధాని భారత్‌కు వచ్చిన తర్వాతే ఈ అంశాలపై చర్చ జరగనుంది. ‘ఆపరేషన్ సింధూర్’పై జులై 29న లోక్‌సభ, రాజ్యసభల్లో సుదీర్ఘ చర్చ జరగనుంది. ఈ అంశంపై లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల పాటు.. అధికార విపక్షాల మధ్య మాటల తుటాలు పేలనున్నాయి. ఇప్పటికే ఈ అంశాలపై విపక్షాలు కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇకపోతే పహల్గామ్ ఘటనలో నిఘా వ్యవస్థ విఫలమైందని.. భారత్-పాక్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టత ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నుంచి ఈ అంశాలపై చర్చకు పట్టుబడుతున్నాయి విపక్షాలు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్చకు అంగీకరించింది.