August 4, 2025 7:05 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

MS Dhoni: ఐసీసీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ధోనికి చోటు

భారత్ సమాచార్.నెట్: టీమిండియా మాజీ కెప్టెన్ (Team India Former Captain) మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni)కి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన తాజా ‘హాల్ ఆఫ్ ఫేమ్’ (Hall of Fame) జాబితాలో ధోనికి చోటు లభించింది. 2025 ఏడాదికి గానూ ధోనితో పాటు గ్రేమ్ స్మిత్ (ద‌క్షిణాఫ్రికా), హ‌షిమ్‌ ఆమ్లా (ద‌క్షిణాఫ్రికా), మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా), డేనియెల్‌ వెటోరి (న్యూజిలాండ్‌), సారా టేలర్ (మహిళా క్రికెటర్‌, ఇంగ్లాండ్‌), సనా మీర్‌ (మహిళా క్రికెటర్‌, పాకిస్తాన్‌) హాల్‌ ఆఫ్ ఫేమ్‌లో జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఇక హాల్ ఆఫ్ ఫేమ్‌‌లో చోటు దక్కడంపై ధోని స్పందించారు. ఇది ఒక అద్భుతమైన గౌరవం. ప్రపంచ క్రికెట్‌కి సేవలందించిన గొప్ప ఆటగాళ్ల సరసన నా పేరు ఉండటం అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప అనుభూతి అని ధోని పేర్కొన్నారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని.. తన కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 17,266 పరుగులు చేశాడు. అతని నాయకత్వంలో భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఛాంపియన్స్ ట్రోఫీల‌ను టీమ్ఇండియాకు అందించాడు ధోని.
క్రికెట్‌కు విశేష సేవలందించిన ఆటగాళ్లకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు కల్పిస్తుంది. హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇప్పటివరకు 122 మంది క్రికెటర్‌లకు చోటు లభించింది. హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న 11వ భారత్ క్రికెటర్‌గా ధోని రికార్డుల్లోకెక్కాడు. ధోని కంటే ముందు సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వినూ మన్కడ్, డయాన్ ఎడుల్జీ, వీరేంద్ర సెహ్వాగ్, నీతు డేవిడ్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
Share This Post