భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: జూలై 21 నుంచి ఆగస్ట్ 21వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొత్త అటెండెన్స్ విధానం అమల్లోకి రానున్నట్లు సమాచారం. వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో డిజిటెల్ అటెండెన్స్ ఫార్మేట్ అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా ఎంపీలు లాబీలో కాకుండా తమ సీటు వద్దే అటెండెన్స్ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది.
అయితే లాబీలో చాలాసార్లు ఎంపీలతో నిండి ఉండటంతో.. సమయం వృథా అవుతోందని.. అందుకే సమయం ఆదా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ పేర్కొంది. అంతే కాదు కొంతమంది లాబీలో హాజరు వేసి కార్యకలాపాల్లో పాల్గొనకుండా వెళ్లిపోతున్నారని.. అటెండెన్స్ ద్వారా వారి రోజువారీ జీతభత్యాలు, చర్చల్లో పాల్గొన్న సమంయ లెక్కించేందుకు ఉపయోగపడుతోందని తెలిపింది. ఈ కొత్త హాజరు వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆసక్తి చూపుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే ఈ కొత్త విధానం అలవాటు అయ్యే వరకు లాబీలోనూ అటెండెన్స్ పద్ధతి కొనసాగుతోందని కూడా సదురు వర్గాలు చెప్పాయి. అయితే ఈ నూతన విధానంలో ప్రధాన మంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నేతలకు హాజరు సంతకం నుండి మినహాయింపు ఉంటుంది. కాగా జూలై 21 నుంచి ఆగస్ట్ 21వరకు జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఇప్పటికే రాష్ట్రపతి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆగస్టు 13, 14 తేదీల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సమావేశాలను ఆ రెండు రోజులు రద్దు చేసింది కేంద్రం.
Share This Post