భారత్ సమాచార్.నెట్: దేశంలోని అన్ని పోస్ట్ ఆఫీసుల్లో ఆగస్ట్ 1 నుంచి డిజిటల్ చెల్లింపులు స్వీకరించే విధానం అమలులోకి రానుంది. పోస్టల్ శాఖలో ఐటీ వృద్ధికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు పోస్టాఫీసులు యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) వ్యవస్థతో అనుసంధానమవ్వకపోవడంతో డిజిటల్ లావాదేవీలు పరిమితంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లావాదేవీలను సులభతరం చేయడమే లక్ష్యంగా డైనమిక్ క్యూఆర్ కోడ్ ఆధారంగా నూతన డిజిటల్ చెల్లింపు అప్లికేషన్‌ను రూపొందిస్తున్నారు.
ఈ ఆధునికీకరణలో భాగంగా ఐటీ 2.0 ప్రాజెక్ట్ కింద డిజిటల్ చెల్లింపుల పథకాన్ని ఇప్పటికే కర్ణాటక సర్కిల్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఆ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీనిని విస్తరించాలని నిర్ణయించారు. పోస్టల్ విభాగంలో ఐటీ కొత్త మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, డిజిటల్ చెల్లింపులకు వీలు అవుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రణాళిక అమలవ్వటం ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఫైనాన్షియల్ సేవల విస్తరణకు ఊతమివ్వనుందని అధికారులు భావిస్తున్నారు.
ఇకపై మనీ ఆర్డర్ చేయాలన్నా, పార్సిల్ పంపాలన్నా, పథకాల్లో డబ్బులు కట్టాలన్నా ఫోన్ ఉంటే చాలు. డిజిటల్ పేమెంట్ సౌకర్యం వల్ల కస్టమర్లు నగదు వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. చిన్న మొత్తాల చెల్లింపుల కోసం చిల్లర దొరకలేదనే ఇబ్బంది ఉండదు. కౌంటర్ల వద్ద నిరీక్షణ సమయం తగ్గుతుంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్ తీసుకున్న ఈ ప్రయత్నం కస్టమర్లకు సౌకర్యంగా ఉండటమే కాకుండా, పోస్టాఫీసుల పని సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.
Share This Post