భారత్ సమాచార్.నెట్, కరీంనగర్: డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్(DMJU) ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ఎంపీ భవనంలో నిర్వహించారు. సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వివిధ డిజిటల్ మీడియా ప్రతినిధులు హాజరై డిజిటల్ మీడియా బలోపేతానికి పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం రాష్ట్ర కమిటీ సమక్షంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీఎంజేయూ రాష్ట్ర, జాతీయ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలను గుర్తించినట్లుగా డిజిటల్ మీడియాను కూడా గుర్తించాలని కోరారు. అందుకు తగిన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.
అందుకే డిజిటల్ మీడియాను జనం ఆదరిస్తున్నారు:
ప్రస్తుతం డిజిటల్ మీడియా ప్రభంజనం నడుస్తుందని, సామాన్యులు ఎదురుకొంటున్న సమస్యలను ప్రభుత్వాలకు, ప్రజలకు డిజిటల్ మీడియా కళ్లకు కట్టినట్లు ఎప్పటికప్పుడు చూపిస్తుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో తమవంతు బాధ్యతగా ముందు ఉండడంతో ప్రజలు డిజిటల్ మీడియాను ఆదరిస్తున్నారని స్పష్టంచేశారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించి డిజిటల్ మీడియాకు చట్టభద్దత కల్పించి అక్రిడేషన్ కార్డులతోపాటు ప్రభుత్వ స్కీములు వర్తింప జేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థపాక అధ్యక్షులు ముతేష్, జాతీయ నాయకులు ఏనుగు మల్లారెడ్డి, చందా శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్, సహాయ కార్యదర్శి సునీల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ నిజాముద్దీన్, మంద వేణుగోపాల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొమ్మ గణేష్, తదితరులు పాల్గొన్నారు.