భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: భారత తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యమైంది. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజ్ జాబితాను ఖరారు చేసింది ఎన్నికల సంఘం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ ఎలక్టోరల్ కాలేజ్‌లో పార్లమెంట్ సభ్యులు ఉంటారని కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసింది.
ఉప రాష్ట్రపతిని ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుందని.. త్వరలో ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. కాగా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 (1) ప్రకారం.. ఎన్నికైన రాజ్యసభ సభ్యులు, నామినేటెడ్ రాజ్యసభ సభ్యులు, ఎన్నికైన లోక్‌సభ సభ్యులతో కూడిన ఎలక్టోరుల్ కాలేజ్ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద ఎన్నికలు నిర్వహిస్తారు.
ఇకపోతే భారత్ ఉప రాష్ట్రపతిగా 2022లో జగదీప్ ధన్కర్ బాధ్యతలు చేపట్టాగా.. మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఆ పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ధన్కర్ ప్రకటించగా.. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.