భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఊహించని షాక్ తగిలింది. లోన్ ఫ్రాడ్ కేసులో అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆగస్ట్ 5న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది ఈడీ. దాదాపు రూ.17 వేల కోట్ల మేర లోన్ తీసుకుని మోసం చేశారనన్న అభియోగంపై ఈడీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద జూలై 24న అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలు, బిజినెస్ పార్ట్‌నర్స్ ఇళ్లతో సహా వారికి చెందిన కంపనెనీలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మూడు రోజులపాటు నిర్వహించిన ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు సహా హార్డ్ డిస్క్‌లు ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయనను విచారించేందుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఎస్ బ్యాంక్ నుంచి రూ.3 వేల కోట్ల రూపాయల రుణం తీసుకుని.. దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లోన్ మంజూరు చేసేందుకు ఎస్ బ్యాంక్ ప్రమోటర్ల ఖాతాలకు లంచం రూపంలో నిధులు బదిలీ అయినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. ప్రస్తుతం ఈ ఆరోపణలపై ఈడీ దృష్టి సారించింది. ఇక అనిల్ అంబానీ విచారణకు హాజరవుతే.. మనీలాండరింగ్ చట్టం కింద ఆయన స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేయనుంది.