భారత్ సమాచార్.నెట్: దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని.. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై తాజాగా భారత్ ఎన్నికల సంఘం స్పందించింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలను అసంబద్ధమైన విశ్లేషణగా పేర్కొంది ఎన్నికల సంఘం. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు రాహుల్ చేసిన ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది.
అంతేకాదు తప్పుదోవ పట్టించే వివరణలు వ్యాప్తి చేసినందుకు రాహుల్ ప్రమాణపూర్వక ఫిర్యాదు సమర్పించాల్సిందిగా లేదా దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేసింది. ఎన్నికల కమిషన్‌పై చేసిన ఆరోపణలు నిజమేనని రాహుల్ నమ్మితే.. ఆ విషయాన్ని డిక్లరేషన్ సమర్పించాలని.. డిక్లరేషన్ సమర్పించకపోతే ఆయన చేసిన విశ్లేషణలు, తీర్మానాలు అసంబద్ధమైనవిగా పరిగణించక తప్పదని స్పష్టం చేసింది.
ఇకపోతే బిహార్‌లోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, ఇతర ముఖ్యాంశాలపై చర్చించేందుకు గురువారం సాయంత్రం రాహుల్ గాంధీ ఇండియా కూటమి తరఫున విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే రాహుల్ గాంధీ ఓటర్ల మోసంపై ప్రెజెంటేషన్ ఇచ్చి మరీ సంచలన ఆరోపణలు చేశారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. కాగా, రాహుల్ చేసిన ఆరోపణలను బీజేపీ కూడా తీవ్రంగా ఖండించింది. రాహుల్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వ్యాఖ్యానించింది.