భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: భారత్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 300లకు పైగా రాజకీయ పార్టీలపై వేటు వేసింది ఎన్నికల సంఘం. దేశంలో గుర్తింపు పొందని రాజకీయ పార్టీలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటన చేసింది. గత 6 ఏళ్లుగా ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయని 334 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది ఎలక్షన్ కమిషన్.
ఈసీ నిబంధనల ప్రకారం.. రిజిస్టర్ అయిన ప్రతి రాజకీయ పార్టీ నిర్దిష్ట కాలంలో ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే 2019 నుంచి ఒక్క ఎన్నికలో కూడా పాల్గొనని పార్టీలపై తాజాగా ఈసీ వేటు వేసింది. పేరుకు పార్టీలు ఉన్న.. వీటికి కార్యాలయాలు లేవని.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది.
ఇకపోతే దేశవ్యాప్తంగా 2,854 గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీలు ఉండగా.. వీటిలో 334 పార్టీలను తొలగించింది ఈసీ. దీంతో ప్రస్తుతం గుర్తింపు లేని పార్టీల సంఖ్య 2520కి తగ్గింది. ఇక ప్రస్తుతం 67 ప్రాంతియ రాజకీయ పార్టీలు, ఆరు జాతీయ పార్టీలు దేశంలో చురుకుగా ఉన్నట్లు ఈసీ తెలిపింది. భవిష్యత్తులో కూడా ఇలా గుర్తింపు లేని పార్టీలు తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది ఈసీ వర్గాలు వెల్లడించాయి.