భారత్ సమాచార్, జాతీయం ;
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ సోమనాథ్ కి తాజాగా కేరళలోని శ్రీ శ్రీ ఉడియన్నూర్ దేవి ఆలయం ఒక అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ… దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో వస్తారని ఆయన ఊహించారు. కానీ వారి సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో పై విధంగా స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తే యువతను ప్రార్థనా స్థలాల వైపు ఆకర్షించడానికి దోహదపడుతుందన్నారు. దేవాలయాలు కేవలం నామ జపానికి (దేవుని నామ జపం) వచ్చే వృద్ధులకు మాత్రమే కాకుండా సమాజాన్ని మార్చే ప్రదేశాలుగా మారాలని ఆయన ఆకాంక్షించారు. ఆలయ నిర్వాహకులు, కమిటీలు, ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థలు, దాతలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. యువత దేవాలయాల వైపు ఆకర్షితులు కావడానికి, వారి కెరీర్‌ను అభివృద్ధి చేసుకునేందుకు ఈ ఆలోచన దోహదపడుతుందన్నారు. ఆ దిశగా జరిపే కృషి విజయవంతమైతే సమాజంలో పెద్ద మార్పును చూడగలుగుతామన్న ఆశాభావాన్ని ఇస్రో ఛైర్మన్ వ్యక్తం చేశారు.