భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో దారుణం జరిగింది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన బాధితుడిని ఎస్సై గదిలోకి తీసుకువెళ్లి బూతులు తిడుతూ ఇతర సిబ్బందితో కలిసి రబ్బర్ బెల్ట్, కర్రలతో చితక బాదడంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానిక నాయకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకుంది. సింగరేణి కాలనీలో నివాసముండే బొందిలి రాంసింగ్(55) పండ్ల వ్యాపారి. రెండునెలల క్రితం అతడి భార్య శకుంతల బాయితో ఇంటి పొరుగున ఉండే ఓ మహిళతో గొడవ జరిగింది. అదేరాత్రి రాంసింగ్ భార్య శకుంతల తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.
ఎస్సై దాష్టికం:
పక్కింటి మహిళ దాడి చేసిన కారణంగానే తన భార్య మృతి చెందిందని రాంసింగ్ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆరోగ్య సమస్యలతోనే శకుంతల మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక వచ్చింది. ఇది తెలుసుకున్న రాంసింగ్ బుధవారం సాయంత్రం ఇన్‌స్పెక్టర్‌ను కలుద్దామని సైదాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఇన్‌స్పెక్టర్ లేకపోవడంతో ఎస్సై సాయికృష్ణను కలిసేందుకు వెళ్లాడు. ఆలయ పూజారి క్షుద్రపూజలు చేస్తున్నాడంటూ రాంసింగ్ ప్రచారం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని స్థానిక మహిళలతో కలిసి పూజారి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు నమోదు చేసుకున్న సదరు ఎస్సై పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన రాంసింగ్‌ను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయాడు. కాలర్ పట్టుకుని బూతులుతిడుతూ గదిలోకి తీసుకువెళ్లాడు. ఫోన్ లాక్కొని స్టేషన్‌లో ఉన్నఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిసి గదిలో లైట్లు ఆపివేసి బెల్ట్‌లు, కర్రలతో చితకబాదాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానిక నేతలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు.
కాళ్లమీద పడ్డా కనికరించలేదు:
విషయం తెలుసుకున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్‌పాటిల్ పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఎస్సై తీరుపై ఆగ్రహించి బాధితుడి కుటుంబసభ్యులను, నేతలను సముదాయించారు. తాను అనారోగ్యంతో ఉన్నానని కాళ్లమీద పడ్డా కనికరించలేదని బాధితుడు రాంసింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. నీవు ఎవరికి చెప్పుకుంటా వో చెప్పుకో.. నన్ను ఎవరూ ఏమి చేయలేరు.. చేస్తే వేరే పోలీస్‌స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతా అంటూ హుకుం జారీ చేశారని తెలిపాడు. ఫోన్‌లు సైతం గుంజుకున్నారని వివరించాడు. పోలీసులు కొట్టిన దెబ్బలకు నడువలేని స్థితిలో ఉన్నానని తెలిపారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. పోలీసులు కొట్టడంతో తలకు. శరీరంపై గాయాలవడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని కథనాలు: