భారత్ సమాచార్. నెట్, న్యూఢిల్లీ: రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ (Jagjit Singh Dallewal) ఎట్టకేలకు నిరాహార దీక్ష విరమించారు. పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్‌లో నిర్వహించిన ‘కిసాన్ మహా పంచాయత్’లో నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో, దల్లేవాల్ 131 రోజుల దీక్షకు తెరపడింది. దీక్ష విరమణ తర్వాత రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘మీరంతా ఆమరణ నిరాహార దీక్ష వీడాలని నన్ను కోరారు. ఈ ఉద్యమాన్ని ఇంత గొప్పగా నడిపినందుకు మీకు రుణపడి ఉంటాను. మీ మనోభావాలను గౌరవిస్తూ.. మీ ఇష్టప్రకారమే దీక్ష విరమిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. అయితే, దీక్ష విరమించుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి రణ్‌వీత్‌సింగ్ బిట్టు అభ్యర్థించిన మరుసటి రోజే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కేంద్రమంత్రుల అభ్యర్థన తర్వాత..
పంటలకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీతో పాటు పలు డిమాండ్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు గతేడాది నవంబర్ 26న దల్లేవాల్ దీక్ష చేపట్టారు. రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 131 రోజులుగా ఆయన దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం జనవరిలో రైతులను చర్చలకు ఆహ్వానించడంతో దీక్ష చేపట్టిన స్థలంలోనే వైద్య సాయం తీసుకొనేందుకు ఆయన అంగీకరించారు. కానీ, తన నిరాహార దీక్షను మాత్రం కొనసాగిస్తూ వచ్చారు. దీంతో, శనివారం కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. కేంద్రంతో రైతు సంఘాల ప్రతినిధుల చర్చలు కొనసాగుతున్నాయని.. మే 4న ఉదయం 11గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. దల్లేవాల్ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆ వెంటనే దల్లేవాల్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.
Dallewal: అసలైన రైతు నేత.. 131 రోజుల తర్వాత దీక్ష విరమణ
RELATED ARTICLES