భారత్ సమాచార్.నెట్, కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆగస్టు 15 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ‘స్త్రీ శక్తి’ పేరుతో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదొడ్డి తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ సౌకర్యం ఉంటుందని వివరించారు. మహిళలు తమ ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్‌కార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం 6,700 బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, దీనికోసం రూ.1,950 కోట్ల వ్యయం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో 1,400 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించినట్లు కూడా ఆయన వెల్లడించారు.
మరిన్ని కథనాలు
పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు.. ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం